ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19: రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ అంజి మండిపడ్డారు. తక్షణమే వాటిని సంస్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో పరిస్థితులకు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గురుకులాలు, కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకుంటునప్పటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ఎద్దేవా చేశారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందందన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యారంగాన్ని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. వర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైనభోజనం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అంజి హెచ్చరించారు.