Homeguard Suicide | హైదరాబాద్ : రాష్ట్రంలోని హోంగార్డుల పట్ల కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. 15 రోజులైనా నేటికీ జీతాలు ఇవ్వడం లేదు. దీంతో హోంగార్డుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలిచాలనీ జీతాలతో వెల్లదీస్తున్న హోంగార్డులకు నెలకు జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కుటుంబాన్ని పోషించలేక, ఇటు ఇంటి అద్దెలు చెల్లించలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఓ హోంగార్డు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నెరేడ్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో జీ గోవర్ధన్ అనే హోంగార్డు(డ్రైవర్) నివాసం ఉంటున్నాడు. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్‌గా 2024 జూన్ 22 నుంచి పని చేస్తున్నాడు. అయితే నిన్న రాత్రి 10 గంటలకు గోవర్ధన్ ఇంటికి వచ్చాడు. ఇంటి అద్దె చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాత్రి 11.30 గంటలకు తన ఇద్దరు పిల్లలతో కలిసి తన అత్తగారింటికి వెళ్లింది. గోవర్ధన్ ఒక్కడే తన ఇంట్లో నిద్రించాడు.
గురువారం ఉదయం 9 గంటలకు భార్య తన ఇంటికి తిరిగొచ్చింది. డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉండడంతో ఆందోళనకు గురైన ఆమె.. కిటికీలో నుంచి చూసింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న భర్తను చూసి భార్య లబోదిబోమంటూ కుటుంబ సభ్యులను, బంధువులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న నెరేడ్మెట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.
నెలకు జీతం రాకపోవడంతో ఆర్థిక విషయాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. చివరకు ఇంటి అద్దె చెల్లించేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో.. బుధవారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్ ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. గోవర్ధన్‌కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.