ఉప్పల్, అక్టోబర్ 17: ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన వెంకట్రామయ్య (39) రామంతాపూర్ వెంకట్రెడ్డినగర్లో ఉంటున్నాడు. పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో రెండేండ్లుగా హోంగార్డుగా పనిచేస్తున్నాడు. తన నివాసంలో గురువారం సాయంత్రం చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
గత సంవత్సరం సెప్టెంబర్లో రవీందర్ అనే హోంగార్డు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించి.. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవీందర్ చికిత్స పొందుతున్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దవాఖానకు వెళ్లి హోంగార్డును పరామర్శించడమే కాకుండా.. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరం కావస్తున్నా తమ సమస్యలను సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదని హోంగార్డులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం హోమ్గార్డుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొని విఫలమైనదని, వెంకట్రామయ్యది ప్రభుత్వ హత్యేనని హోంగార్డులు ఆరోపించారు.