సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట్: గ్రేటర్లో మహమ్మారి జడలు విప్పడంతో దీనిబారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. వారం కిందట వెయ్యిలోపు ఉన్న కేసులు అమాంతం పెరుగుతుండడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ దవాఖానలతోపాటు కొవిడ్ రోగులకు విశేష సేవలందించే గాంధీలో సాధారణ పడకలతోపాటు అత్యవసరమైన వారికి ఆక్సిజన్ కల్పించేందుకు పడకలను సిద్ధం చేస్తున్నారు.
రెండు వేల బెడ్ల సామర్థ్యం ఉన్న దవాఖానలో ఐసీయూ, ఆక్సిజన్ కలిపి 1500 వరకు పడకలు ఉన్నాయి. మరో 300 పడకలు చిన్నపిల్లల విభాగంలో వెంటిలేటర్లతో ఏర్పాటు చేశారు. గంటకు 7 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగేవి 8 ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయి. ఓపీ, అత్యవసర సేవలు కొనసాగిస్తూనే అవసరమైతేనే అడ్మిషన్లు, శస్త్రచికిత్సలు నిర్వహించాలని ఇప్పటికే అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. నయమైన వారిని వెంటనే ఇంటికి పంపించి ఖాళీ అయ్యే పడకలను కొవిడ్ రోగులకు కేటాయించడంతోపాటు మందులు, సిబ్బంది కేటాయింపు, వైద్యుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించారు. కరోనా విజృంభణతో దవాఖానలో అన్నిరకాల సెలవులను రద్దు చేశారు. ప్రస్తుతం 71 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల పరిధుల్లో క్రమేణా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ కేసులన్నీ ఎక్కువగా గాంధీకి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు దవాఖాన వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. రెండువేల పడకల సామర్థ్యం ఉన్న గాంధీలో 1500 వరకు ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. మరో 300 పడకలు చిన్న పిల్లల విభాగంలో వెంటిలేటర్లతో సహా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గతంలో కరోనా రెండో దశ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో గాంధీలో నాన్ కొవిడ్ సేవలను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రస్తుతం దవాఖానలో నాన్ కొవిడ్ ఇన్‌పేషెంట్ల సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే నాలుగైదు రోజులుగా గాంధీకి కొవిడ్ కేసులు పదుల సంఖ్యలో వస్తున్నాయి. ప్రధానంగా గాంధీకి వస్తున్న కేసుల్లో ప్రైవేట్ వైద్యశాలల నుంచి వస్తున్నవే అధికంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. గుండె, మూత్రపిండాలు, ఇతర సంబంధిత వ్యాధులతో బాధపడుతూ.. ప్రైవేట్‌లో చికిత్స తీసుకుంటున్న వారికి కొవిడ్ నిర్ధారణ జరిగిన తర్వాత గాంధీకి తరలిస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నాన్ కొవిడ్ రోగుల సంఖ్య తగ్గితే… ఆ పడకలను కొవిడ్ వారికి కేటాయించేందుకు వెసులుబాటు ఉంటుంది. అందుకే దవాఖానలో కోలుకున్న, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్న నాన్ కొవిడ్ రోగులను డిశ్చార్జి చేసేందుకు వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం జారీ చేసిన ముఖ్యమైన సర్క్యులర్‌లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ముందస్తుగా ఇచ్చిన సెలవులు రద్దు..
కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దరిమిలా రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వైద్యులు, ఇతర యంత్రాంగం అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సిబ్బందికి ఎలాంటి సెలవుల మంజూరు ఉండదని మంగళవారం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అంతేగాకుండా ముందస్తుగా ఇచ్చిన సెలవులు సైతం రద్దయినట్లుగా అందులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఓపీ, అత్యవసర విభాగం, ఇతర సేవలు యథావిధిగా కొనసాగించేందుకు నిర్ణయించినప్పటికీ.. అడ్మిషన్లు, ఆపరేషన్లు మాత్రం అత్యవసరమైతేనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. సాధారణంగా మందులతో వ్యాధి నయం అయ్యే వారు, కొంతకాలం పాటు శస్త్ర చికిత్సలు వాయిదా వేసేందుకు వెసులుబాటు ఉన్న రోగులను ఆస్పత్రిలో చేర్చుకోకుండా మందులు, వైద్య సూచనలు ఇచ్చి పంపనున్నారు. ప్రస్తుతం వైద్యశాలలో 71 మంది కొవిడ్ రోగులు ఉన్నట్లుగా గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కేవలం సోమ, మంగళవారాల్లో 30 మంది కొవిడ్ రోగులు.. అందునా ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్న వారు చేరినట్లుగా ఆయన పేర్కొన్నారు.
సిబ్బందికి బూస్టర్ డోసు..
గాంధీ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, నాలుగో తరగతి సిబ్బందికి మూడో డోసు వ్యాక్సిన్ వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. బుధ, గురువారాలలో దవాఖానలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటి, వార్డుబాయ్‌లు, ఇతర సిబ్బందికి తప్పనిసరిగా వందశాతం మూడో డోసు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని శాఖాపరమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు అర్హులని తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని వైరస్ల మాదిరిగానే ఒమిక్రాన్ వేరియంట్ కూడా కొవిడ్ మాదిరిగానే లక్షణాలున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తేనే దీనిని అడ్డుకోగలం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మేరకు దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేశాం. 600 ఐసీయూ, 600 ఆక్సిజెన్, 600 సాధారణ బెడ్లు అందుబాటులో ఉంచాం. గంటకు ఏడు టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే ఎనిమిది ప్లాంట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వెళ్లే వారు కొవిడ్ జాగ్రత్తలు పాటించారు. గాంధీ దవాఖానలో పెద్ద ఎత్తున డాక్టర్లు, సిబ్బందికి కరోనా సోకిందని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవం.