నగరంలో రంగుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబసమేతంగా తీరొక్క రంగులతో.. ఆనందోత్సాహాల నడుమ మంగళవారం హోలీ పండుగ జరుపుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇందిరాపార్కు వరకు పలు చోట్ల ప్రత్యేక సంఘాల ఆధ్వర్యంలో సామూహికంగా వేడుకలు చేసుకున్నారు.
నగరంలో హోలీ సంబురాలు మంగళవారం వైభవంగా జరిగాయి. రంగులు చల్లుకుంటూ నగరవాసులు సందడి చేశారు. చాలాచోట్ల సహజరంగుల వినియోగానికే మొగ్గు చూపారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఇందిరాపార్క్, ట్యాంక్ బండ్, జలవిహార్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సరూర్‌నగర్ తదితరప్రాంతాల్లో కుటుంబ సమేతంగా అందరూ ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కుల, మత భేదాలు లేకుండా హోలీ వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు. కాగా బుధవారం కూడా నగరంలోని కొన్ని చోట్ల హోలీ పండుగను జరుపుకోనున్నారు.
– సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ)
సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నవ్య నాటక సమితి 65వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 9న జరగనున్న నాట్య యోగ కార్యక్రమ పోస్టర్‌ను రెడ్‌హిల్స్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ రమణాచారి, చిత్రంలో నవ్యనాటక సమితి అధ్యక్షులు వి. విజయకుమార్, ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ జి. వసుంధర, నృత్య గురువులు గీతాగణేషన్ తదితరులు