సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): నగరంలోని సహజ వనరులు, చెరువుల రక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోయింది. బండ్లగూడలోని సుర్రం చెరువు హద్దుల నిర్ధారణలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), నీటి పారుదల శాఖ అనుసరిస్తున్న పక్షపాతం సర్కార్ పనితీరుకు అద్దం పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం, బఫర్ జోన్ ఖరారు కాగా, తుది నోటిఫికేషన్ ఒక్కటే పెండింగ్లో ఉంది. కానీ అధికారులు మాత్రం మళ్లీ రీ సర్వే పేరుతో కాలయాపన చేయడం వెనుక అసలు అంతర్యమేంటనీ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నా యి.
ఫాతిమా ఓవైసీ కళాశాల అక్రమ కట్టడాలను కాపాడేందుకే అధికారులు రీసర్వే పేరిట కొత్తనాటకానికి తెరలేపారంటూ ప్రజల్లో అనుమానాలు వ్య క్తం అవుతున్నాయి. సుర్రం చెరువు రక్షణపై సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం సాగుతోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) సేకరించిన 2012, 2022 నాటి ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే చెరువు హద్దులు ఎలా మారిపోయాయో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయో స్పష్టంగా తెలుస్తోంది.
గతం లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, నీటి పారుదల, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు సంయుక్తంగా సుర్రం చెరువును క్షేత్రస్థాయిలో సర్వేచేసి ఫాతిమా ఓవైసీ కళాశాల సహా పలు కట్టడాలు చెరువు పరిధిని ఆక్రమించి నిర్మించినవేనని నిర్ధారించారు. అప్పటి హైదరాబాద్ కలెక్టర్ కూడా ఈ ఎఫ్టీఎల్ పరిధిని ధృవీకరిస్తూ, చెరువుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ను, అక్రమ నిర్మాణాల నివేదిక కూడా లోకాయుక్తాకు సమర్పించారు. ఇంతలా స్పష్టత ఉన్నా.. ప్రస్తుతం ఈ చెరువు విషయమై తుది నోటిఫికేషన్ విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు.

హద్దుల కోసం అదనపు సమయం ఎందుకు?
ఫాతిమా ఓవైసీ కళాశాల ఆక్రమణలపై హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ఈ సందర్భంగా అధికారుల వైఖరి ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. చెరువు ఎఫ్టీఎల్ హద్దులను నిర్ధారించడానికి తాము మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేస్తామని అధికారులు కోర్టును కోర డం తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నీ ఖరారై కేవల ం ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడమే మిగిలి ఉన్నప్పుడే, హద్దుల నిర్ధారణ కోసం అధికారులకు అదనపు సమయం ఎందుకు కావాలనే విమర్శలు వస్తున్నాయి. సర్కార్కు సుర్రం చెరువు సంరక్షణపై చిత్తశుద్ధి ఉంటే.. తక్షణమే ఎఫ్టీఎల్, తుది నోటిఫికేషన్ జారీ చేసి.. ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర విభాగాలను సమన్వయం చేస్తూ పరిరక్షించాలి. కానీ సర్కార్ మాత్రం ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగానే మీనమేషాలు లెక్కిస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తుది నోటిఫికేషన్ విడుదల చేయాలి
సుర్రం చెరువు పరిరక్షణపై 2016లోనే లోకాయుక్తలో మొదటి కేసు దాఖలు చేశాను. నీటి మట్టాన్ని తగ్గించి, దాని రీ-నోటిఫై చేయాలని అధికారులు ఏ రకమైన వాదనలు తెచ్చినా అది లోకాయుక్త ఆదేశాలకు విరుద్ధమే అవుతుంది. గతంలో వివిధ శాఖల అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు, ఆక్రమణదారులు బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు మరోసారి రీ సర్వే చేయాలనడం చూస్తుంటే ఎఫ్టీఎల్ సరిహద్దులను మార్చే ప్రయత్నాలకు తెరలేపారనే అనుమానం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుర్రం చెరువు తుది నోటిఫికేషన్ విడుదల చేయాలి. తక్షణమే ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– లుబ్నా సార్వత్, పర్యావరణ కార్యకర్త