సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : దేశంలో గొప్ప గొప్ప చట్టాలన్నీ తామే చేశామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు ఆ సర్కారే చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోంది. పాలనలో పారదర్శకత, ప్రభుత్వ విధానాలపై జవాబుదారీతనమే లక్ష్యంగా తీసుకువచ్చిన చట్టాన్ని అపహస్యం చేసేలా ఇప్పుడు కాంగ్రెస్ పాలన సాగుతోంది. దేశభద్రత, వ్యక్తిగత అంశాలు మినహా మరే సమాచారం కూడా దాచిపెట్టడానికి వీల్లేదనీ చట్టం చెబుతుంటే… ఆ జాబితాలోనే తమ కార్యకలాపాలు సాగుతున్నట్లు వివరణ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రయోజనార్థం సమాచారం ఇవ్వాలని కోరితే… సమాచారం ఇవ్వడం కుదరనట్లు ఆ శాఖ వ్యవహారం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.
నగరంలో పట్టణాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతుల కల్పనమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తోంది. ఈ శాఖలో జరిగే వ్యవహారాలన్నీ కూడా ప్రజాప్రయోజనాలకు అవసరమైనవే. కానీ ఈ విభాగం ఇప్పుడు సహ చట్టం-2005లోని సెక్షన్ 8లోని మినహాయింపు జాబితాలో చేరినట్లుగా వ్యవహారం మారింది. ఈ సెక్షన్ ప్రకారం దేశభద్రత, విదేశీ వ్యవహారాలు, ట్రేడ్ రహస్యాలు, కోర్టు వ్యవహారాలను ఇవ్వడానికి వీల్లేదని చెబుతోంది. కానీ భూ వినియోగ మార్పిడి కూడా దేశ భద్రతకు భంగం కలిగిస్తుందనే చందంగా హెచ్ఎండీఏ నిర్వర్తించే విధులను దాచిపెడుతోంది. ఈ సమాచారం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం లేదని తెలిసినా… కాంగ్రెస్ సర్కారు పాలనలో జరిగిన అవకతవకలు బయటకు రాకుండా హెచ్ఎండీఏ యంత్రాంగం సమాచారమే లేదనట్లుగా జవాబిస్తోంది.
ఎందుకీ గోప్యత…
11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో గడిచిన ఏడాదిన్నర కాలంగా భూ వినియోగ మార్పిడి అంశంలో పలు అనుమానాలు ఉన్నాయి. చెరువుల పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమనట్లుగా వ్యవహరించి.. ఇప్పుడు ఆ చెరువు భూములనే చెరబడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇబ్బడిముబ్బడిగా బఫర్ జోన్ ప్రాంతాలను కూడా రెసిడెన్షియల్ జోన్లుగా మారిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో హెచ్ఎండీఏ విడుదల చేసిన బఫర్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్లుగా ఫలానా సర్వే నంబర్లలోని భూమిని మార్పు చేస్తున్నామంటూ ప్రకటన కూడా జారీ చేసింది. కానీ వెల్లడించిన ఆ సమాచారాన్ని ఇవ్వడానికే హెచ్ఎండీఏ యంత్రాంగం జంకుతోంది.
హెచ్ఎండీఏ పరిధిలో గడిచిన ఏడాదిన్నర కాలంగా జరిగిన భూ వినియోగ మార్పిడి పురోగతి, దరఖాస్తుల సంఖ్య, ప్రస్తుత స్థితి, బఫర్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ల పరిధిలోకి మారిన భూముల వివరాలతో పాటు పలు అంశాలపై సమాచారాన్ని కోరుతూ దరఖాస్తు చేయగా, LR. No.OPTr/615/RTI/ADMINPIO/HMDA/2025 పేరిట జూన్ 18న హెచ్ఎండీఏ స్వీకరించింది. దీనిపై జూలై 22 తర్వాత హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం వివరణ ఇచ్చింది. ఇందులో సమాచారం కోరిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని, దరఖాస్తుదారు కోరిన వివరాలు ఆర్టీఐ చట్టం పరిధిలోకి రావని, అదేవిధంగా ప్రత్యేకంగా ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు పేర్కొంటేనే తమ పరిధిలోకి వస్తాయంటూ వ్యాఖ్యానించింది.
హెచ్ఎండీఏ ఆర్టీఐకి ఆతీతమా?
హెచ్ఎండీఏ ఆర్టీఐకి అతీతమైనట్లుగా ఇచ్చిన వివరణ పలు అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ వినియోగ మార్పిడి దరఖాస్తుల్లో మెజార్టీ వివాదాస్పదంగానే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్ఛగా చెరువు, ప్రభుత్వ భూములను కూడా చెరబట్టినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏలో వచ్చిన భూ వినియోగ మార్పిడి దరఖాస్తుల వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంగా పలు దశల్లో పెండింగ్‌లో ఉన్న వివరాలు బయటకు రాకుండా దాచిపెట్టే క్రమంలోనే సమాచారం లేదని బుకాయించినట్లుగా సమాచారం.
నిజానికి హెచ్ఎండీఏ పరిధిలో గత ప్రభుత్వమే ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో పబ్లిక్ డొమైన్‌లోనే ఈ వివరాలు కనిపించేవి. కానీ వీటిని ఇప్పుడు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏం ఉందనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ప్రతి దశలో దరఖాస్తుల వివరాలు ఆన్లైన్లో స్టేటస్ తెలుసుకునేలా అందుబాటులో ఉంచాలి. కానీ ఇవేవి తమ పరిధిలోకి రావన్నట్లుగా హెచ్ఎండీఏ వద్ద ఉండాల్సిన సమాచారం ఆర్టీఐ పరిధిలోకి రాదని వ్యాఖ్యానించడం వెనుక భూ వినియోగ మార్పిడిలో జరుగుతున్న ఏదో గూడుపుఠాణీ ఉందనే ఆరోపణలు ఉన్నాయి.