కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఫలితంగా వేల కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు ప్రజలు ఆ భూముల్లో జెండా పాతేస్తున్నారు. మియాపూర్లో హెచ్ఎండీఏకి ప్రభుత్వం అప్పగించిన వందలాది ఎకరాలపై కబ్జాదారుల కన్ను పడింది. మియాపూర్ రెవెన్యూ పరిధిలోని 100,101 సర్వే నంబర్లలో సుమారు 450 ఎకరాల భూమి హెచ్ఎండీఏ ఆధీనంలోనే ఉంది. అక్కడ గతంలో 100 ఎకరాల్లో ఇంటర్ సిటీ బస్ టర్మినల్ నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసి, పీపీపీ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించింది. అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు ఆగిపోగా, అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగానే ఉంది. ఆ భూములపై వివాదం రాజుకోవడంతో సుప్రీం కోర్టు స్టే ఇచ్చినా, హెచ్ఎండీఏ ఆధీనంలోనే ఉంది. అయితే ఒకే చోట వందల ఎకరాల్లో ఉన్న భూమిని కాపాడాల్సిన హెచ్ఎండీఏ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా మూడు రోజులుగా మియాపూర్లోని హెచ్ఎండీఏ భూములను కబ్జా చేసి గుడిసెలు వేసుకునేందుకు వేలాది మంది తరలివచ్చి అక్కడ తిష్టవేసిన పరిస్థితి. వందలాది మంది పోలీసు బలగాలు రక్షణగా వచ్చి స్థలాన్ని కాపాడాల్సిన పరిస్థితికి దారితీసింది.
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ఏర్పాటైన హెచ్ఎండీఏకు ప్రభుత్వం గ్రేటర్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అప్పగించింది. అలా హెచ్ఎండీఏ ఖాతాలో సుమారు 8,540 ఎకరాల భూములున్నాయి. వీటిలో మియాపూర్లోని సర్వే నం. 100,101లో సుమారు 450 ఎకరాల భూమి ఉంది. వీటిని పరిరక్షించే బాధ్యత ఎస్టేట్ విభాగం , ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారుల సంయుక్త బాధ్యత. ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో భూముల వద్ద కాపలాగా ఉండాల్సిన వారు అక్కడ విధులు నిర్వహించడం లేదు. ఇదే అదునుగా భావిస్తున్న కబ్జాదారులు రాత్రికి రాత్రే తాత్కాలిక కట్టడాలు, గుడిసెలు వేస్తూ స్థలాల్లో పాగా వేస్తున్నారు. ఎస్టేట్ విభాగం తరపున మొత్తం ఏడుగురు సైట్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో హెచ్ఎండీఏ భూములను ప్రతి రోజు ప్రత్యక్షంగా సందర్శించి అక్కడ జరుగుతున్న విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి. కానీ, రెండు విభాగాల మధ్య సమన్వయ లోపమే మియాపూర్లో భూములను కబ్జా చేసేందుకు అవకాశం కల్పించిందనే ఆరోపణలు ఉన్నాయి.
మియాపూర్లో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. ఇటీవల కొందరు ఖాళీ భూముల్లో మొదట గుడిసెలు వేయగా, ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రభుత్వ భూముల్లో పేదలకు స్థలాలు ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. దీంతో ఒక్కసారి 4వేల మందికి పైగా పేద ప్రజలు రెండు, మూడు రోజుల వ్యవధిలోనే మియాపూర్ భూముల్లోనే తిష్ట వేసుకొని కూర్చుకున్నారు. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో ఇదంతా జరుగుతుందని గుర్తించారు. జరిగిన ఘటనపై హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ వెంటనే పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎస్టేట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను ఆదేశించారు. దీంతో ఒక్క రోజు వ్యవధిలోనే ఫెన్సింగ్ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. సుమారు రూ.2.65 కోట్ల వ్యయంతో స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయాలని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.