HMDA | సిటీబ్యూరో: గ్రేటర్లో నిర్మాణ రంగం కుదేలైతున్నది. హైడ్రా కూల్చివేతలు ఓవైపు, ఆగిన నిర్మాణ కార్యకలాపాలతో కొనుగోలుదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో నోటీసు బోర్డులను డిస్ప్లే చేయాలని, సర్వే, భూమి, బిల్డర్ ప్రొఫైల్, పర్మిషన్లు, రేరా అనుమతులు వంటి వివరాలతో కూడిన నోటీసు బోర్డులను ప్రాజెక్టుల ముందు ప్రదర్శించేలా ఆదేశాలిచ్చింది. కానీ ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు.
హైడ్రా కూల్చివేతలు, ఎన్ఓసీల్లో తలెత్తిన సమస్యల నేపథ్యంలో హెచ్ఎండీఏ పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నది. కానీ వాటిని ఆచరణలోకి తీసుకురావడంలోనే వైఫల్యం చెందుతున్నది. గతంలో భవన నిర్మాణ అనుమతులకు రెవెన్యూ, ఇరిగేషన్ ఎన్ఓసీలు తప్పనిసరి చేసింది. అనుమతుల ప్రక్రియలో ఈ రెండు శాఖలు ఆమోదం తెలిపితే గానీ లెవల్ 2 దాటే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. తాజాగా నిర్మాణ ప్రాజెక్టు వద్ద, సంబంధిత అనుమతులు, రెవెన్యూ, ఇరిగేషన్, రేరా వంటి వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల తనిఖీలకు వెళ్లే అధికారులకు ప్రక్రియ సులభతరం అవుతుందని, నోటీసు బోర్డులు ప్రదర్శించిన వాటినే క్షేత్రస్థాయి పరిశీలన చేసి అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టింది. కానీ హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడా ఈ విధానం అమలు కావడం లేదు. కనీసం హెచ్ఎండీఏ సూచనలను కూడా బిల్డర్లు, నిర్మాణ సంస్థలు పట్టించుకోవడం లేదు.
హెచ్ఎండీఏ పలు విధానాలను ప్రవేశపెడుతున్నా… వాటిని పర్యవేక్షించి ఆచరణలోకి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా హైడ్రా తర్వాత హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ మధ్య ఉన్న సమన్వయం లోపం బట్టబయలైంది. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఎన్ఓసీలను పరిగణనలోకి తీసుకుని హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చింది. తీరా హైడ్రా అధికారులు వచ్చి చెరువు భూముల ఆక్రమణ పేరిట ఆ నిర్మాణాలను కూల్చివేస్తుండటంతో కొనుగోలుదారులు బలైపోతున్నారు. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఎన్ఓసీ పత్రాల ఆధారంగానే అనుమతులు జారీ చేశారే తప్ప.. వాటిని క్షేత్రస్థాయిలో హెచ్ఎండీఏ అధికారులు పరిశీలించకపోవడంతో ఈ సమస్యలకు కారణమని తేలింది.