HMDA | సిటీబ్యూరో, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : పిలిచిన పనులకే టెండర్లను పిలుచుకుంటూ..హెచ్ఎండీఏ కాలయాపన చేస్తున్నదనే విమర్శలను మూటగట్టుకుంటున్నది. ఇలా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలోనూ అడ్వయిజరీ నియామకానికి కూడా రెండు సార్లు టెండర్లు పిలిచే పరిస్థితి వచ్చింది. కొత్తగా కొత్వాల్‌గూడ ఏకో పార్కులో అరుదైన పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ టెండర్లను రీకాల్ చేశారే తప్ప.. పనుల్లో ఒక్క అడుగు పడలేదు.
అభివృద్ధి పనులు చేపట్టడంలో హెచ్ఎండీఏ పనితీరు డిఫరెంట్. కానీ అదంతా గతం. ఇప్పుడంతా టెండర్లు పిలవాలి.. కొర్రీలతో పనులను పక్కనపెట్టేయాలి.. వీలైతే మరోసారి టెండర్ రీకాల్ చేస్తే సరిపోతుందనే విధానమే నడుస్తోంది. ముఖ్యంగా గతంలో చేపట్టిన పనులను కూడా అతి కష్టం మీద గట్టెక్కిస్తున్నామనే తీరుగా పనులు చేపడుతున్నారు. ఇలా ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పక్కన పడుతున్నాయి.
ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నా… దానికి అనుగుణంగా ప్రణాళికలను అమలు చేయడంలో హెచ్ఎండీఏ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కీలకమైన ప్రాజెక్టుల విషయంలో అధికారుల వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకునే ఎలివేటెడ్, మీరాలం కేబుల్ బ్రిడ్జి ప్రాజెక్టులకు కూడా ట్రాన్సాక్షనల్ అడ్వైజరీ పేరిట పిలిచిన టెండర్లను పొడిగించారు. కొత్వాల్‌గూడ ఏకో పార్కు విషయంలోనూ ఇప్పటివరకు మూడు సార్లు టెండర్లు పిలిచినా.. పనులు పూర్తి కాలేదు. అతిపెద్ద పక్షిశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు గతంలో టెండర్లను ఆహ్వానించారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ మరోసారి టెండర్లను పిలుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.