సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : ఖజానా నింపుకోవడమే పరమావధిగా ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా నగరంలో ఉన్న భూములను విక్రయిస్తూనే ఉంది. సంక్షేమం, ప్రగతి, అభివృద్ధి పనులను పక్కనపెట్టి… కేవలం ప్రభుత్వ భూములకు ఆర్రాస్ పాడుతూనే ఉంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ భూముల వేలం నోటిఫికేషన్ చూస్తే… ఆదాయంపై ఉన్న యావ, సామాన్యుడిపై అవసరాలను గుర్తించడం లేదని తేలిపోతుంది. ఓవైపు భూముల ధరలు పెంచడం, మరోవైపు ఉన్న భూములను వేల కోట్లకు విక్రయించడంతో సొంతింటి కల మరింత భారంగా మారస్తోంది. ఈ నగరంలోని 8 ల్యాండ్ పార్శిళ్లు, 168 ఓపెన్ ప్లాట్లను వేలానికి పెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారి తరహాలో ధరల దందాకు తెరలేపింది. కేవలం హకీంపేటలోని 8.25 ఎకరాల భూమిని ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేయాలని చూస్తున్నది.
వేలం ప్రారంభ ధరతోనే..
షేక్ పేట్ మండలం హాకీంపేట గ్రామ సర్వే నెం. 102/1లోని 8.24 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎకరా కనీస ధరను ఏకంగా రూ. 99 కోట్లుగా నిర్ణయించింది. ప్రభుత్వమే ఈ తరహాలో భూములను ధరలను పెంచడం ఒక ప్రైవేటు రియల్టర్ ఇంకెంత ధరతో మార్కెట్లోకి తీసుకువస్తారనేది అంతు చిక్కని అంశంగా మారింది. వేలం ప్రారంభ ధరతోనే రూ. 851 కోట్లుగా పెట్టి, ఎలాగైనా రూ. 1000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఆశపడుతోంది. ఫలితంగా నగరంలో గజం స్థలం కొనాలన్నా… ఇల్లు కట్టాలన్నా సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాంతం అప్పుల పాలు కావాల్సిన దుస్థితిని ప్రభుత్వమే స్వయంగా కల్పిస్తున్నది.
అంగట్లో సర్కారు భూములు
ఆదాయం కోసం ఆరాటపడుతున్న సర్కారు… ప్రభుత్వ భూములు అనేవి భవిష్యత్తులో ప్రజావసరాల కోసం, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బస్ డిపోల వంటి ప్రజా ప్రయోజన కట్టడాల కోసం ఉపయోగించాలి. కానీ ప్రస్తుతం సర్కారుకు ఇదొక హెచ్ఎండీఏ భూములు కామధేనువులా మారాయి. కేవలం రోజువారీ ఖర్చులు, అప్పుల కిస్తులు చెల్లించడానికి వీలుగా విలైన భూములను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నది. ఒకవైపు మోకిలా, మేడిపల్లి వంటి లే అవుట్లలో వందలాది ప్లాట్లను అమ్మనున్నది. ఇందులో షేక్‌పేట్ పరిధిలోని హకీంపేటలో 8.24 ఎకరాలు, ఉండగా… కుత్బుల్లాపూర్‌లోని సూరారంలో 4840 చ.గజాలు, శేరిలింగంపల్లిలోని చందానగర్ వద్ద 484 గజాలు, మోకీలాలో 100 ప్లాట్లు, బైరాగిగూడ 2420 గజాలు, మేడిపల్లి 68 ప్లాట్లు, నార్సింగిలో 5687 కోట్లు, పీర్జాదిగూడలో 2057, 726 గజాలు, బౌరంపేట్‌లో 2420 గజాల్లో ఉన్న భూములను సర్కారీ వేలానికి సిద్ధమైంది.