HMDA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ ప్రణాళికలను పట్టాలెక్కించేందుకు నియమించిన ట్రాన్సాక్షన్ అడ్వయిజరీలు పనిచేస్తున్నాయా? లేదా అనేది సందిగ్ధంలో ఉంది. హెచ్ఎండీఏ చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ప్రణాళికల బాధ్యతలను సలహాదారులకు అప్పగించారు. ఇప్పటికే రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులతోపాటు, మీరాలం లేక్ కేబుల్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టుల టెండర్ల విధానం, ఆర్థిక పరమైన అంశాలపై అధ్యయనం చేసేందుకు గతంలోనే టెండర్లను హెచ్ఎండీఏ పిలిచింది. అయితే ఇప్పటికే వాటి నియామాకం పూర్తి కాగా, అసలు సలహాదారు సంస్థలు ఏం చేస్తాయనేది గందరగోళంగా మారింది.
టీఏ చెబితేనే..
హెచ్ఎండీఏ పనితీరులో మార్పు వచ్చింది. గతంలో మాదిరి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టే విధానం నుంచి, ఎన్నడూ లేని విధంగా ట్రాన్సాక్షన్ అడ్వయిజరీ(టీఏ) చెబితే గానీ పనులు చేపట్టలేని స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. సమగ్ర విధివిధానాలపై స్వయంగా పరిశీలన చేయాల్సిన అవసరం లేకుండానే… వడ్డించిన విస్తరి తరహా పని విధానాన్ని హెచ్ఎండీఏ పరిధిలో ప్రవేశపెట్టింది. ఇలా కీలకమైన ప్రాజెక్టుల విషయంలో టీఏల నియామకం చేసుకుని ప్రణాళికల అధ్యయనం పేరిట కాలయాపన చేస్తోంది.
ఎన్నో ప్రాజెక్టులకు..
హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే హెచ్ఎండీఏకు ట్రాన్సాక్షన్ అడ్వయిజరీ ద్వారా పనిలో మార్పులు వచ్చాయి. హెచ్ఎండీఏ ఇప్పటివరకు నగరానికి తలమానికమైన ఎన్నో ప్రాజెక్టులను ఎలాంటి టీఏలు లేకుండా నిర్మాణం చేసి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నది. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ వంటి విషయాలను సొంతంగా అధ్యయనం చేసే హెచ్ఎండీఏ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో… అసలు టీఏలు ఏం నివేదిస్తాయనేది ఇప్పుడు సంబంధిత విభాగాధిపతులను కూడా గందరగోళానికి గురి చేస్తోంది. హెచ్ఎండీఏ మూడు ప్రాజెక్టుల కోసం టీఏల నియామకానికి చేపట్టగా… ఇందులో ఎలివేటెడ్ కారిడార్, మీరాలం కేబుల్ బ్రిడ్జి పనులను అధ్యయనం చేసే బాధ్యతలను ఆయా ఏజెన్సీలు తీసుకున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి సర్వే చేస్తుంది. ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అధ్యయనానికి ఎలాంటి ప్రామాణికత ఉందనే విషయాలు మాత్రం గోప్యంగానే ఉన్నాయి.
ఒరిగేదేమిటీ…?
పౌరులకు మెరుగైన మౌలిక వసతులను కల్పించాల్సిన అంశంలో ఆదాయ మార్గాలు, నిర్మాణ వ్యయం వంటి అంశాలపై ఎలాంటి అధ్యయనం చేయాల్సిన పనిలేదని నిబంధనలే చెబుతున్నాయి. కానీ వాటిపై అధ్యయనం చేయడానికి టీఏలను నియమించుకోవడం ఇప్పుడు హెచ్ఎండీఏ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఆర్థికపరమైన, ఇతర అంశాల్లో సాధ్యాసాధ్యాలను అంచనా వేసే బాధ్యతలను నిర్వర్తించే టీఏలు… చెప్పిందే హెచ్ఎండీఏ తూచా తప్పకుండా అమలు చేయాల్సి ఉండటంతో… ఆ సంస్థ ప్రజా ఉపయోగాలను ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాణానికి ప్రధానమైన ఆర్థిక వనరులు, వినియోగం, నిర్వహణ భారం వంటి రెవెన్యూ పరమైన అంశాలపై అంచనా వేస్తూ టీఏలూ సలహాలిస్తారని చెబుతున్నా…హెచ్ఎండీఏకు ఆర్థిక భారమే తప్పా… ఆదాయం మిగిలే అవకాశం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా ట్యాంక్ బండ్ పరిసరాల్లోనూ అధ్యయనం చేసే బాధ్యతలను ట్రాన్సాక్షన్ అడ్వయిజరీలకు అప్పగించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది.