HMDA | ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గతంలో వారసత్వ సంపదగా గుర్తించి ఆధునీకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు వాటిని విస్మరిస్తున్నది. నగరంలో వందకు పైగా కట్టడాలు, నిర్మాణాలు, భవనాలు, చేద, మెట్ల బావులు ఉండగా, ఇందులో ఇప్పటికే 12 కట్టడాలను హెచ్ఎండీఏ గుర్తించి.. ఆధునీకరించింది. అయితే మిగిలిన 60కిపైగా పురాతన కట్టడాల అభివృద్ధిని పక్కన పెట్టేసింది. దీంతో భావితరాలకు చారిత్రక మూలాలను అందించే కట్టడాలు శిథిలావస్థకు చేరుతున్నాయి.
– సిటీబ్యూరో, నవంబర్ 7(నమస్తే తెలంగాణ)
నిజానికి హైదరాబాద్ వ్యాప్తంగా 100కు పైగా హెరిటేజ్ కట్టడాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో గతంలోనే పలు ప్రాజెక్టుల కింద పలు నిర్మాణాలను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో మరో 60-70కిపైగా కట్టడాలను ఇప్పటికే గుర్తించి నివేదికలు సిద్ధం చేశారు. టూంబ్స్, మినార్లు, చేద, మెట్ల బావులను అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ హెచ్ఎండీఏ అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు వేయలేదు. కనీసం పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయలేదు.
చారిత్రక కట్టడాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధునీకరించి..పూర్వ వైభవం తీసుకొచ్చింది. అప్పటి సర్కారు ఆదేశాలతో హెచ్ఎండీఏ అధికారులు 12 కట్టడాలు, మెట్ల బావులు, నిర్మాణాలు, భవనాలను ఆధునీకరించారు. గుడిమల్కాపూర్‌లోని శివ్‌బాగ్, భగవాన్‌దాస్ మెట్ల బావులు, లంగర్ హౌజ్‌లోని కటోరా హౌస్, గచ్చిబౌలిలోని మెట్ల బావి, లంగ్ హౌజ్‌లోని ఎంజీ మెమోరియల్ స్టెప్ వెల్, సరూర్ నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోం, బుద్ధ భవన్ సమీపంలోని సైదానీమా టూంబ్స్ వంటి శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను గుర్తించి చర్యలు చేపట్టారు. వీటిని ఆధునీకరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు.