సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పర్యవేక్షణలో ఉన్న పార్కుల్లో మౌలిక వసతుల కల్పనపై హెచ్ఎండీఏ అధికారులు ఎట్టకేలకు దృష్టి పెట్టారు. ఈ మేరకు పలు పార్కుల్లో వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల కోసం ఆట స్థలాల ఆధునీకరణ, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. గడిచిన ఏడాది కాలంగా హెచ్ఎండీఏ పరిధిలో పార్కుల నిర్వహణ అధ్వానంగా మారడంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
అయినా అధికారులు ఆధునీకరణపై దృష్టి పెట్టలేదు. ఇటీవల పలు పార్కులు శిథిలావస్థకు చేరిన మౌలిక వసతులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో.. చివరకు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న బీఎన్‌రెడ్డినగర్‌లోని రాజీవ్ గాంధీ పార్క్‌లో మెట్ల మార్గం, వాకింగ్ ట్రాకులకు మరమ్మతులు, టాయిలెట్లను ఆధునీకరించనున్నారు.
అదేవిధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయనుండగా, డస్ట్ బీన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక వనస్థలిపురంలోని అభ్యుదయనగర్ పార్క్‌లో వాకింగ్ ట్రాక్ మరమ్మతులు, కంపౌండ్ వాల్ పెయింట్ పనులతోపాటు, ఇతర సివిల్ పనులు చేయనున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉండే హెచ్ఎండీఏ పార్క్‌ను అభివృద్ధి చేయాలని అనేకసార్లు స్థానికులు ఫిర్యాదులు చేయడంతో… ఇటీవల ఆ పార్కులో వాకింగ్ ట్రాకులు, టాయిలెట్లతోపాటు ఆధునీకరించేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు.