సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : మైత్రీవనంలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి బేగంపేట పైగా ప్యాలెస్‌కు తరలించే పనులకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తున్నది. ఆగస్టు మొదటి వారంలోనే హెచ్ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటుకు తరలించేలా జీవోలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా పైగా ప్యాలెస్‌లో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం ఇంటీరియర్ పనులు సాగుతుండగా… తాజాగా పైగా ప్యాలెస్‌కు కార్యాలయం తరలింపునకు బ్రేక్ పడినట్లు తెలిసింది.
తరలింపునకు సంబంధించిన ఆరు నెలల కిందటే జీవో జారీ చేసి, తీరా ఇంటీరియర్ పనులు ముగిసిన తర్వాత తరలింపు నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్వర్ణజయంతి కార్యాలయానికి హెచ్ఎండీఏకు చెందిన ఇతర కార్యాలయాలను కూడా తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. పైగా ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని, హైడ్రా ఆఫీసును అక్కడే ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పైగా ప్యాలెస్‌కు హెచ్ఎండీఏ తరలించొద్దని స్పష్టమైన సూచనలు ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం చేసినట్లు సమాచారం.