HMDA | సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) :నగరంలో అక్రమ నిర్మాణాలపై జరుగుతున్న కూల్చివేతల నేపథ్యంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం అధికారులు కీలక చర్యలు చేపట్టారు. తమ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించడంతోపాటు, నిబంధనలు అతిక్రమించిన ఇంటి యజమానులకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా, చిత్రపురి కాలనీలో నిర్మించిన సుమారు 50కిపైగా విల్లాలకు స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నోటీసులను అందించినట్లు తేలింది. అయితే నోటీసుల ప్రకారం గ్రౌండ్+1 విల్లాలకు అనుమతులు తీసుకుని, నిర్మాణాలను అందకు భిన్నంగా, అక్రమంగా మరో అంతస్తు విల్లాలను బిల్డర్లు నిర్మించినట్లు వెల్లడైంది. నిర్మాణంలో జరిగిన అవకతవకలను పట్టించుకోకపోవడంతోనే ఈ తరహా నిబంధనల అతిక్రమణ జరిగినట్లు తేలింది.
చర్యలు తీసుకుంటారా?
గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రధాన కేంద్రానికి సమీపంలో ఉండే సంపన్నుల విషయంలో హెచ్ఎండీఏ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. కానీ తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 15 రోజుల గడువులోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని హెచ్ఎండీఏ ఆదేశించింది. ఈ మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులతో ఆయా భవన యజమానులకు సూచించినట్లు తేలింది. అయితే ఈ తరహా నిర్మాణాలు ఎన్ని ఉన్నాయనే అంశాన్ని కూడా తేల్చే క్రమంలో ఈ తరహా నోటీసుల ప్రక్రియకు తెరలేపినట్లుగా చర్చ నడుస్తోంది.
హకీంపేట్ లే అవుట్లో మౌలిక వసతులు
హెచ్ఎండీఏ పరిధిలో భూముల వేలానికి అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. వందల ఎకరాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న లే అవుట్లపై దృష్టి పెట్టిన అధికారులు… అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. వచ్చే ఏడాదిలోగా లే అవుట్లను అభివృద్ధి చేయనున్నారు.
షేక్పేట్ మండలం హకీంపేట్ పరిధిలోని హుడా హైట్స్ లే అవుట్లో రోడ్లు, హద్దురాళ్లు, అంతర్గత రోడ్లతోపాటు, డ్రైనేజీ కోసం రూ. 1.2 కోట్లతో పనులు చేపట్టనున్నారు. హుడా హైట్స్ పేరిట 50 ఎకరాల విస్తీర్ణంలో 92 ప్లాట్లను డెవలప్ చేయగా, తాజాగా మూడు నెలల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేసేలా పనులు చేపట్టనున్నారు. అందుకు అనుగుణంగా టెండర్ ప్రక్రియను హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు చేపట్టారు. వీటితోపాటు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన అన్ని లే అవుట్లలో కూడా ఇదే తరహాలో మౌలిక వసతుల కల్పనకు పనులు చేపట్టనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.