సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్.. రెండేండ్ల పాలనలో భూ సమీకరణ ప్రణాళికలను అమలు చేయలేకపోతున్నది. హెచ్ఎండీఏ పరిధిని 11 జిల్లాలకు విస్తరించిన ప్రభుత్వం, దానికి తగినట్లు భూ బ్యాంక్‌ను నిర్మించడంలో ఘోరంగా విఫలమైంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి సహా 11 జిల్లాలకు హెచ్ఎండీఏను విస్తరించిన కాంగ్రెస్ సర్కార్.. ఈ జిల్లాల్లో కొత్తగా ఒక్క గజం భూమిని కూడా ల్యాండ్ బ్యాంకుల్లోకి చేర్చలేకపోయింది. గతంలో ప్రతిపాదించిన కొల్లూరు, ముత్తంగి, ఎదులానాగులపల్లి, తెల్లాపూర్, అమీన్పూర్, పటాన్చెరు, ఉప్పల్ భగాయత్, కొర్రెములా, ప్రతాపసింగారం, కోహెడా వంటి ప్రతిపాదిత ప్రాంతాల నుంచి వేల ఎకరాల భూములతో ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసే ప్రతిపాదనలను క్రమంగా అటకెక్కిస్తోంది.
హెచ్ఎండీఏ వైఫల్యం…
రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములను సమీకరించాలనే ప్రతిపాదనలకు క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన రావడం లేదు. ముఖ్యంగా భూముల ధరలు విపరీతంగా పెరగడంతో సర్కారు ఇచ్చే పరిహారానికి రైతులు మొగ్గుచూపడం లేదు. 60శాతం లెక్కన డెవలప్ చేసిన ప్లాట్లను రైతులకు ఇచ్చేందుకు ప్రణాళికలు ఉన్నా, మౌలిక వసతుల కల్పనలో హెచ్ఎండీఏ జాప్యం, రెవెన్యూ వివాదాలు, సుదీర్ఘ కాలంపాటు పనులను వాయిదా వేయడంతోనే ల్యాండ్ ఫూలింగ్ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఇక పరిహారంగా ఇచ్చిన తర్వాత ప్లాట్ల వేలాన్ని జాప్యంచేయడం కూడా సమస్యగా మారింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడంతో ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు రైతులు కూడా ముందుకు రావడం లేదు. హైడ్రా పేరిట సర్కారు చేసిన విధ్వంసం సామాన్యుడిని భయాందోళనలకు గురిచేస్తుంది.
ఈ క్రమంలో హెచ్ఎండీఏకు భూములు ఇచ్చినా కూడా నిర్ణీత కాలంలోగా ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం లేకపోవడంతోనే రైతులు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. కాగా, విస్తరించిన హెచ్ఎండీఏ పరిధికి అనుగుణంగా శివారు ప్రాంతాల్లో భారీ ల్యాండ్ బ్యాంక్ సృష్టించాలనే లక్ష్యం వైపు అడుగులు పడటం లేదు. ఈ క్రమంలోనే కొత్తగా అన్ని వైపులా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను విస్మరించి, కేవలం పథకాలకు రంగులు పూయడానికి కాంగ్రెస్ సర్కారు పరిమితమైంది. 11 జిల్లాల ప్రజల ఆకాంక్షలను కాలరాస్తూ, రియల్ రంగాన్ని సంక్షోభాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కారు హామీలు కూడా మాటలు కోటలు దాటితే… పనులు పిట్ట గోడను కూడా దాటలేకపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతోనే హెచ్ఎండీఏకు భూమినిస్తే.. అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మడం లేదు. దీంతోనే నగరంలో ల్యాండ్ ఫూలింగ్ పథకాన్ని హెచ్ఎండీఏ సమర్థవంతంగా అమలు చేయలేకపోతుంది.