సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల కబ్జా ప్రయత్నం సంచలనంగా మారింది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితి అదుపులోకి రావడం లేదని భావించిన పోలీసులు మియాపూర్లో 144 సెక్షన్ విధించారు. ఈ కఠిన నిర్ణయానికి దారితీసిన మియాపూర్లోని హెచ్ఎండీఏ భూముల కబ్జా వెనుక పెద్ద కథే ఉంది. మియాపూర్ రెవెన్యూ సర్వే నం. 100,101 లో ఉన్న సుమారు 445 ఎకరాల భూమిని ఆనుకొని స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్, దీప్తీశ్రీనగర్, పీజేఆర్ కాలనీలు ఉన్నాయి. 2003లో ప్రభుత్వం హెచ్ఎండీఏకు కేటాయించిన భూముల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ లేకపోవడంతో క్రమంగా స్థానికులు కబ్జా చేసి ఇండ్లను నిర్మించారు. కబ్జా చేస్తున్నది ప్రభుత్వ భూమి అని తెలిసినా, దానికి ఎలాంటి పత్రాలు లేకపోయినా గుడిసెలు కాకుండా ఏకంగా జీ ప్లస్ 1, 2 అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. ఇలా హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న భూముల చుట్టూ అక్రమ కట్టడాలు ఉన్నట్లుగా ఆలస్యంగా గుర్తించిన అధికారులు గత నెల 30న కూల్చివేతలు మొదలు పెట్టారు. ప్రైవేటు భూముల సర్వే నంబర్ల ద్వారా ప్రభుత్వ భూములకు బై నంబర్లతో డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకోవడమే కాకుండా భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు సర్వే నం. 101లో వెలసిన 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
మియాపూర్లో తాజా పరిస్థితులు ఇలా ఉంటే… కబ్జాల పర్వం ఎప్పుడో మొదలైంది. హెచ్ఎండీఏ భూములను కాపాడాల్సిన ఎస్టేట్ విభాగం, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. దాని ఫలితంగానే కబ్జా చేసిన భూముల్లో తాత్కాలిక నిర్మాణాలైన గుడిసెలు, రేకుల షెడ్లు కాకుండా పక్కా భవనాలు నిర్మించారు. అయినా ఆ సమయంలో హెచ్ఎండీఏ అధికారులు మాత్రం అక్రమ కట్టడాలను అడ్డుకోలేదు. వేల కోట్ల విలువ చేసే భూముల్లో నిర్మాణాలు చేస్తుంటే.. అడ్డుకోకుండా వారి నుంచి అంతస్తుకు కొంత మొత్తం చొప్పున వసూళ్లు చేసుకొని మిన్నకుండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ ఎస్టేట్ విభాగంతో పాటు ఎన్ఫోర్స్మెంటులోని పోలీసు అధికారులు సైతం కబ్జాదారులకు సహకరించడం వల్లే 2, 3 అంతస్తుల పక్కా భవనాలు మియాపూర్ భూముల్లో వెలిశాయని తాజా కూల్చివేతలతో వెల్లడైంది. విలువైన భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం కుమ్మక్కైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు చుట్టూ ఉన్న కాలనీ, బస్తీ వాసులు సైతం ఈ భూముల్లో పాగా వేయాలన్న పథకంతో వేలాది మంది అక్కడికి వచ్చేలా చేసి కబ్జాకు ప్రయత్నించారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తీవ్రంగా పరిగణించి మియాపూర్లో 144 సెక్షన్ను విధించాల్సి వచ్చింది.
హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టడంతో ఏమీ చేయలేని కొందరు కబ్జా దారులు తాము కబ్జా చేసిన స్థలాన్నే కాకుండా అక్కడ ఖాళీగా ఉన్న స్థలాన్ని కబ్జా చేసి గుడిసెలు వేయాలన్న ప్రణాళికను రచించారు. అందులో భాగంగానే ఆ చుట్టు పక్కల ఉన్న వారితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని వర్గాల వారికి మియాపూర్ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోవచ్చని ప్రచారం చేశారు. మే 30న కూల్చివేతలు చేపట్టిన తర్వాత నుంచి ఇదే పనిలో అక్కడి కబ్జారాయుళ్లు పకడ్బందీ పథకాన్ని రచించి ఒకేసారి వేలాది మంది ప్రజలు మియాపూర్ భూముల్లోకి చొచ్చుకువచ్చేలా చేశారు. మూడు రోజుల పాటు వేలాది మంది పేద ప్రజలు మియాపూర్ హెచ్ఎండీఏ భూముల్లో గుడిసెలు వేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకునేందుకు వస్తే వారిపైనే రాళ్ల దాడికి దిగారు.