సిటీబ్యూరో, ఏప్రిల్13,(నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మిద్దె తోటల సాగుబడి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవాస్తవ అన్నారు. అగ్రి-హోర్ట్ సొసైటీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున్న తెలంగాణ రైతు మేళా-2025 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నారు.
ఆర్గానిక్ కూరగాయలు, నాటు విత్తనాలు, మొక్కలు, కుండలు మొదలైనవి 200వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి రైతులు తాము పండించిన, సేకరించిన కూరగాయలు, మిగతా వస్తువులతో ఈ మేళాకు హాజరై స్టాళ్లు పెట్టారు. మూడో రోజు ఆదివారం భారీగా ప్రజలు స్టాళ్లను సందర్శించి, వస్తువులు కొనుగోలు చేశారు.
ఉచితంగా 600 మొక్కలు పంపిణీ
నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ రైతు మేళాలో పలు స్టాళ్లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ వాళ్లు ఇప్పటివరకు 600వరకు వివిధ రకాల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. కాగా, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ స్టాల్‌ను హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవాస్తవ ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ నగరంలో కాలుష్య నియంత్రణకు మిద్దె తోటల సాగుబడి ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ వ్యవస్థాపకులు హర్కర్ శ్రీనివాస్ ఎన్సీఎఫ్ శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్, హెచ్ఎండీఏ ఏడీ విజయబాబు, సినీ నటుడు రఘు తదితరులు పాల్గొన్నారు.