సిటీబ్యూరో: జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన సర్కారు.. కార్పొరేషన్ల రెక్కలు కత్తిరించింది. పౌరుల మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న భవన నిర్మాణ అనుమతుల విషయంలో సరారు తీసుకున్ననిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది. భారీ భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల బాధ్యతలను జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిర్ణయంతో కార్పొరేషన్‌కు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం హారతి కర్పూరం కానుండగా, సామాన్యులకు పౌర సేవలు కుంటుపడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైనేజీలు పొంగినా, రోడ్లు , శానిటేషన్ అధ్వానంగా ఉన్నా జనం వద్దకు వెళ్లేది కార్పొరేషన్ అధికారులే. ఈ పరిస్థితుల్లో హైరైజ్ భవనాల ద్వారా వచ్చే కోట్ల ఆదాయం కోల్పోతే, పారిశుధ్య నిర్వహణ? వీధి దీపాలు, రహదారుల నిర్వహణ మాటేమిటి? అన్న ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఆస్తిపన్ను వసూళ్లతో ఉద్యోగుల నెలవారీ జీతాలకే సరిపోతాయని, ప్రాజెక్టుల సంగతి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అప్పుల ఊబిలో..
జీహెచ్ఎంసీ ఇప్పటికే దాదాపు రూ.4876 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆస్తిపన్ను వసూళ్లు, నిర్మాణ రంగ అనుమతులతోనే నిర్వహణ, ఉద్యోగుల జీతాలతో నెట్టుకొస్తున్నది. అయితే మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సర్కారు 10 అంతస్తులు దాటి నిర్మించే భవనాల అనుమతులను కార్పొరేషన్ కాకుండా హెచ్ఎండీఏ ద్వారా అనుమతులు జారీ చేయనున్నది. అనుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆయా కార్పొరేషన్లకు 8-10శాతం వరకు వాటా పంచనున్నది. వాస్తవంగా జీహెచ్ఎంసీలో ప్రతి ఏటా అన్ని రకాల నిర్మాణ రంగ అనుమతుల ద్వారా రూ.1400 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఈ నేపథ్యంలో నామమాత్రపు వాటాలతో కార్పొరేషన్ల ఆదాయానికి భారీగా గండి పడనున్నది.
ఇప్పటికే ఓ వైపు పౌర సేవలు అందక జనం అల్లాడుతుంటే, ఉన్న ఆదాయాన్ని కూడా హారతి కర్పూరం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీని గడిచిన రెండేండ్లలో సర్కారు ఆదుకున్న పాపాన పోలేదు..అంతేకాకుండా ప్రతి ఏటా బడ్జెట్లో సుమారు రూ. 2654 కోట్ల మేరలో ప్రతిసారి కేటాయింపులు జరపగా, ఒక ఏడాది రూ. 948 కోట్లు, మరో ఏడాది రూ. 542 కోట్లు మాత్రమే నిధులు మంజూరు చేయడం గమనార్హం. అన్నింటికంటే రెండేండ్ల కాలంలో ఏ ఒక్క చోట ప్రాజెక్టు పనులు మొదలు పెట్టిన దాఖలాలు లేవు.
హెచ్ఎండీఏ నిదులను సైతం సర్కారు ఖజానాలోకి మళ్లించిన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్ వంటి హాట్ స్పాట్లలో 40 నుంచి 60 అంతస్తుల వరకు భారీ సై స్రాపర్లు వెలుస్తున్నాయి. వీటి ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం హెచ్ ఎండీఏ ద్వారా లాగేసుకున్నది. ఆదాయం అంతా ప్రభుత్వం తీసుకుంటే, పెరిగే జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించే భారం మాత్రం కార్పొరేషన్లపై వేయడం ఏంటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే కార్పొరేషన్ల మనుగడను ప్రశ్నార్థకం చేసి పౌరుల కష్టాలను మరింత అధికం చేయనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.