సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ) : భూముల క్రమబద్ధీకరణ కోసం హెచ్ఎండీఏ ఎదురు చూపులు తప్పడం లేదు. జూలై 31 వరకు తాజాగా 25 శాతం రాయితీ అవకాశం కల్పించినా… క్షేత్రస్థాయిలో మాత్రం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో వేలాది మంది దరఖాస్తులు గుట్టల్లా పేరుకుపోయాయి. మధ్యతరతిగి ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించినా… అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. హెచ్ఎండీఏ పరిదిలో వచ్చిన లక్షలాది దరఖాస్తుల్లో మెజార్టీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. రెండు నెలల సమయం భూములను క్రమబద్ధీకరించడానికి ఆస్కారం ఉన్నా… యంత్రాంగం మాత్రం యుద్ధప్రాతిపదికన కసరత్తు మొదలుపెట్టలేదు. దీంతో గతంలో ఇచ్చిన రాయితీ అవకాశానికి ఆదరణ రాలేదు అదే తరహాలో తాజా గడువు కూడా ముగిసిపోయేలా ఉంది.
క్షేత్రస్థాయిలో ప్లాట్లను పరిశీలించేందుకు సరిపడా యంత్రాంగం అందుబాటులో లేకపోవడంతో.. ప్రోసీడింగ్స్ జారీ కావడం లేదు. దీంతో వేలాది రూపాయలను ఫీజుల రూపంలో చెల్లించి చివరకు ప్రోసీడింగ్స్ రాక ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఇక పలు దశల్లో ఉన్నా దరఖాస్తుల్లోని లోపాలను సవరించేందుకు అవకాశమే లేకపోవడంతో, ఉన్న దరఖాస్తులకు మోక్షం రావడం లేదు. కనీసం పలు శాఖల మధ్య లోపించిన సమన్వయ లోపం దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తోంది. ఫీజులు చెల్లించిన తర్వాత నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఇలాంటి రాయితీలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతుందనే విమర్శలు ఉన్నాయి. కనీసం జూలై 31లోపు ఫీజులు చెల్లించిన వారికైనా ప్లాట్లను వేగంగా క్రమబద్ధీకరించడం వల్ల ఎల్ఆర్ఎస్కు ఆదరణ వస్తుందంటున్నారు.