HMDA | సిటీబ్యూరో. జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్దమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పనిచేస్తున్నది. కాంక్రీట్ జంగిల్‌గా ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని పచ్చల హారంగా మార్చేసింది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డు చుట్టూ విస్తరించిన పచ్చదనమే ఇందుకు నిదర్శనం. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో ప్రతియేటా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోటి మొక్కలను నాటే లక్ష్యాన్ని నిర్దేశించారు.
దాని ఫలితంగానే ఔటర్ రింగు రోడ్డుతో పాటు ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జాతీయ, రాష్ట్ర రహదారులు, పార్కులు ఇలా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దాని ఫలితంగానే హైదరాబాద్ మహానగరం పచ్చదనంలో పలుమార్లు అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నది. పచ్చదనం నిర్వహణ కోసమే హెచ్ఎండీఏ పరిధిలో ప్రత్యేకంగా ఐఎఫ్ఎస్ అధికారి నేతృత్వంలో అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఉంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏడు విడతలుగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో 6 కోట్లకు పైగా మొక్కలు నాటారు. కొన్ని మొక్కలకు జియో ట్యాగింగ్ సైతం చేసి వాటి పరిరక్షణ బాధ్యతలు హెచ్ఎండీఏ చేపట్టింది.
21 అర్బన్ పారెస్ట్ల అభివృద్ధి
గ్రేటర్ చుట్టూ శివారు ప్రాంతాల్లో ఉన్న రిజర్వు ఫారెస్ట్ (అటవీ ప్రాంతాలు) స్థలాలను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేసింది. సహజమైన అటవీ నిర్మాణానికి భంగం కలుగకుండా, ప్రజలు ప్రకృతి అనుభూతిని పొందేలా అభివృద్ధి చేస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 109 ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయగా, అందులో 21 అర్బన్ ఫారెస్ట్ పార్కులు హైదరాబాద్ చుట్టు పక్కలే ఉన్నాయి. ఇందుకోసం రూ.110 కోట్లను ఖర్చు చేసి, నగర వాసులు అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సేద తీరేందుకు రకరకాల మౌలిక వసతులను, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లను, గుడారాలను నిర్మించారు. ఇవన్నీ నగర వాసులను ఆహ్లాదాన్ని పంచుతుండగా, హైదరాబాద్ మహానగరంలో పచ్చదనం పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషించాయి.
హెచ్ఎండీఏ పరిధిలో 34 చోట్ల నర్సరీలు
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇంటర్‌చేంజ్‌ల వద్ద హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నర్సరీలను ఏర్పాటు చేసి వివిధ జాతులకు చెందిన మొక్కలను పెంచుతున్నది. హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 34 నర్సరీలను విశాలమైన స్థలాల్లో ఏర్పాటు చేసి, ఏడాది పొడవునా మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నర్సరీల్లో 100పైగా జాతులకు చెందిన మొక్కలను పెంచి పెద్ద చేశారు. వాటిని ఏడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలకు, స్థానిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచుతున్నారు.
మహానగరానికి మణిమారంలా..ఓఆర్ఆర్
హైదరాబాద్ మహానగరానికి మణిమారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు పచ్చదనానికి కేరాఫ్‌గా మారింది. ఏడాది పొడువునా ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో కోట్లాది మొక్కలు నాటడంతో పచ్చదనం నిండుగా ఉంది. 158 కి.మీ పొడవునా పచ్చని చెట్లు వాహనదారులను కనువిందు చేస్తున్నాయి. సీఎంఓ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఓ అధికారి ఔటర్ చుట్టు పచ్చదనం పెంపొందించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. రూ.42 కోట్లతో ఓఆర్ఆర్ చుట్టూ డ్రిప్ సిస్టంను ఏర్పాటు చేసి, మొక్కలకు నిరంతరం నీరు అందించేలా ఏర్పాటు చేసింది హెచ్ఎండీఏ. ఓఆర్ఆర్ నుంచి జిల్లాలకు వెళ్లే జాతీయ రహదారులు, నగరం లోపలికి వచ్చే రేడియల్ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లను సైతం సుందరీకరణ పేరుతో పచ్చదనాన్ని పెంపొందించింది.