సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): లేక్‌సిటీగా పేరున్న హైదరాబాద్‌లో చెరువుల సుందరీకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. గ్రేటర్ పరిధిలో చెరువుల సుందరీకరణలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో 3532 చెరువులు, జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. వీటిలో చెరువుల సుందరీకరణకు సంబంధించి వేర్వేరుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సహజ వనరులైన చెరువులను పరిరక్షించడంతో పాటు భావితరాలకు భద్రంగా ఉంచడం, సుందరీకరణకు సంబంధించిన పనులు చేయడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ పనిచేస్తోంది. అయితే చెరువుల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా.. చెరువుల్లో ఆక్రమణలంటూ కూల్చివేతలతో సామాన్యుడిని హడలెత్తించింది.ఇప్పుడేమో చెరువుల సుందరీకరణ పై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఫస్ట్‌ఫేజ్‌లో నాలుగు చెరువుల అభివృద్ధికి ప్లాన్ చేస్తుంది. దీపావళి తరువాత బెంగుళూరుకు వెళ్లి అక్కడి చెరువులను పర్యవేక్షించడానికి సిద్ధమైంది. కానీ, హైడ్రా పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు చెరువులను సుందరీకరించడానికి నిర్ణయిస్తే.. మరోవైపు హెచ్ఎండీఏ 10 చెరువుల అభివృద్ధికి టెండర్లను పిలిచింది.
హైదరాబాద్ సిటీలో చెరువుల పూర్వ వైభవానికి హైడ్రా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతోంది. ఇందులో భాగంగా నగరం నలు వైపుల నుంచి ఒక్కో చెరువును ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వాటిలో బాచుపల్లి-ఎర్రగుంట చెరువు, మాదాపూర్-సున్నం చెరువు, కూకట్పల్లి-నల్ల చెరువు, రాజేంద్రనగర్-అప్పా చెరువులను ఎంపిక చేసింది. ఈ చెరువుల సుందరీకరణను ఆరునెలల్లో పూర్తిచేసేలా ప్లాన్ చేసింది. ఈ చెరువులలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో మార్కింగ్ నెల రోజుల్లో పూర్తి చేయనుంది. తర్వాత చెరువుల చుట్టూ ఫెన్సింగ్, ఆ తర్వాత సుందరీకరణ ..దాదాపు 200 కోట్లతో బ్యూటిఫికేషన్‌కు సిద్ధమైన హైడ్రా దశల వారీగా పనులు చేయనున్నట్లు హైడ్రా అధికారి తెలిపారు. దీనికి సంబంధించి నాన్ రియల్ఎస్టేట్ సంస్థలకు అంటే ప్రభుత్వ , ప్రైవేటు బ్యాంకులు, ఇతర సంస్థలకు కాని సీఎస్ఆర్ పద్ధతిలో పనులు అప్పగించాలని నిర్ణయించింది. వచ్చే సంవత్సరానికల్లా మరికొన్ని చెరువుల సుందరీకరణ పూర్తిచేయాలని హైడ్రా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ముందుగా పైలెట్ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేసిన చెరువులను పూర్తిచేసేందుకు ముందుకు రావాలని కొన్ని బ్యాంకులను హైడ్రా సంప్రదించినట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత హైడ్రా బెంగళూరుకు వెళ్లి.. కొన్ని చెరువులను సందర్శిస్తారు. వరదల విషయంలో బెంగళూరులో సరైన నిర్వహణే లేనప్పుడు అక్కడికి వెళ్లి చెరువుల సుందరీకరణపై ఏం అధ్యయనం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో చెరువుల పునరుజ్జీవం విషయంలో మిషన్‌కాకతీయ పథకం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. చెరువులను ఎలా పునరుద్ధరిస్తారన్న విషయంలో పలు రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చి చెరువులను పర్యవేక్షించి వెళ్లారు. అటువంటిది బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరమేంటి. అంతేకాకుండా హెచ్ఎండీఏ పరిధిలో ఇరవై చెరువులను గతంలోనే డెవలప్ చేశారు. వాటి తాజా స్థితిగతులను అధ్యయనం చేసి, పైలట్ ప్రాజెక్ట్‌లో చెరువులను గతంకంటే మరింత మెరుగ్గా అభివృద్ధి చేయవచ్చు కదా అని హైడ్రా అధికారి ఒకరు చెప్పారు.
చెరువుల సుందరీకరణ విషయంలో ఎవరిది బాధ్యత అన్నది స్పష్టత లేకుండా పోయింది. ఒకవైపు హెచ్ఎండీఏ చెరువుల సుందరీకరణ కొనసాగిస్తుంటే.. హైడ్రా పైలట్ ప్రాజెక్ట్ అంటూ ముందుకు పోతోంది. మరోవైపు నగరంలోని చెరువుల సుందరీకరణ జీహెచ్ఎంసీ చేపట్టాలి. కానీ ఈ మూడు సంస్థలు ఎవరికి వారే అన్నట్లుగా సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో లేక్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తొమ్మిది చెరువులను అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.30 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. నగరంలోని 5 చెరువుల సుందరీకరణకు పదికోట్లు కేటాయించారు. నిజాంపేట్‌లోని తుర్క చెరువుకు 3.52 కోట్లు, పటాన్చెరు గ్రామంలోని తిమ్మక్క చెరువు 1.85 కోట్లు , శంభీపూర్ గ్రామంలోని పోతిన్ చెరువు 1.19 కోట్లు, గాజుల రామారంలోని లింగం చెరువు 3.42 కోట్లు , ముత్తంగిలోని ఎన్నం చెరువుకు 5.02 కోట్లు, మూసాపేట్‌లోని కాముని చెరువుకు 5.15 కోట్లు , బోడుప్పల్‌లోని రా చెరువుకు 5 కోట్లు, సుద్దకుంట 3.07కోట్లు, ఆల్మాస్ కుంటకు 2.17 కోట్లతో సుందరీకరించనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను కూడా పిలిచారు. అయితే చెరువుల హద్దులు నిర్ణయించకుండా చెరువుల డెవలప్మెంట్ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. చెరువుల హద్దులను హడావిడిగా సర్వే చేస్తున్నారని చెబుతున్నారు.