సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రెండేళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎకరం వంద కోట్ల రూపాయలకు విక్రయించి దేశీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించగా… ఇప్పుడు అదే ఆశతో కాంగ్రెస్ సర్కారు భూముల వేలానికి సిద్ధం అవుతున్నది. మార్కెట్ తిరోగమనంలో సాగుతున్నా… భూములకు స్థానికంగా రేటు పెరగకపోయినా.. పెట్టుబడులకు ఆటంకాలు ఎదురైతున్నా ఇలాంటి క్లిష్టమైన సమయంలో భూములను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది.
గడిచిన రెండేళ్ల కాలంగా నగరంలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్‌తో ప్రాజెక్టులను చేపట్టడమే గగనంగా మారడంతో… ఉన్న భూములను విక్రయించి సొమ్ము చేసుకుని, మార్కెట్లో కదలిక వచ్చిందని చెప్పుకోవడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూముల వేలానికి ప్రణాళికలు చేస్తోంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన కోకాపేట్ నియోపోలిస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి గేమ్ ఛేంజర్‌గా నిలిచింది.
అంతకు ముందు నగరంలో భూములను హెచ్ఎండీఏ విక్రయించినా… కోకాపేట భూములకు వచ్చినంత డిమాండ్ ఏ వెంచర్‌కు రాలేదు. ఒక ఎకరం ఏకంగా రూ. వంద కోట్లకు విక్రయించి సిటీ మార్కెట్ స్థాయిని అకాశం ఎత్తుకు చేర్చింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి భూముల వేలం ద్వారా భారీ స్థాయిలో నిధులు సమకూరడంతోపాటు, నగరంలో రియాల్టీలో పెను మార్పులు సంతరించుకున్నాయి. 2021, 2023లో రెండు దఫాలుగా 95 ఎకరాలను విక్రయించిన హెచ్ఎండీఏ దాదాపు రూ. 3వేల కోట్ల ఆదాయం సమకూరించింది.
గంపెడు ఆశలు..
ఎకరం రూ. వంద కోట్లకు విక్రయించడంతో ప్రభుత్వానికి అంచనాలకు మించి ఆదాయం వచ్చింది. దీనికి తోడు అదనంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ స్వరూపాన్ని మార్చివేయగా… అదే తరహాలో బుద్వేల్, మేడిపల్లి, వికారాబాద్ ప్రాంతాల్లోనూ భూములను విక్రయించే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఇదే తరహాలో వెస్ట్ సిటీలోనే హాట్ కేకులాంటి కోకాపేట నియోపోలిస్ భూములకు వేలం నిర్వహించడం ద్వారా మార్కెట్లో కదలిక వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.
గత వేలంలో వచ్చిన రెవెన్యూ తరహాలో ఇప్పుడు కూడా ఆదాయం వస్తుందని గంపెడు ఆశలతో ఉన్న ప్రభుత్వానికి ఈ వేలం నిజంగానే లిట్మస్ పరీక్ష కానుంది. ప్రస్తుతం నియోపోలిస్‌లో 26 ఎకరాల 5-6 ప్లాట్లు అందుబాటులో ఉండగా… ఒక్కో ఎకరానికి అప్సెట్ ధరను రూ. 40-50 కోట్లుగా నిర్ధారించి… వేలం నిర్వహించడం వల్ల ఏకంగా రూ. 1000-1500 కోట్లు ఆదాయం వస్తుందని భావిస్తోంది. అనుకున్నట్లుగా జరిగితే… 26ఎకరాలకే గతంలో కంటే సగానికి పైగా ఆదాయం వచ్చినట్లేనని లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పెట్టుకున్న ఆశలకు మార్కెట్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
నిధులు వస్తేనే అభివృద్ధి పనులు..
కోకాపేటతోపాటు హెచ్ఎండీఏ పరిధిలో వివిధ ప్రాంతాల్లో 1400 ప్లాట్లు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని విక్రయించడం ద్వారా హెచ్ఎండీఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌తోపాటు, ప్రభుత్వం కలల ప్రాజెక్టులైన ఫోర్త్ సిటీ వంటి ప్రాజెక్టులను నిధులు సమకూర్చుకోవచ్చని భావిస్తోంది. దీంతో వేలం ద్వారా వచ్చే నిధులతోనే అభివృద్ధి పనులు చేపట్టే వీలు కలగనుంది.