HMDA | సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలో భూముల వేలానికి కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమవుతున్నది. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగానే రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కోహెడ వద్ద సర్వే నం. 507లో లే అవుట్లో వసతులు కల్పించేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. మరో 8-10 నెలల్లోనే అభివృద్ధి చేసిన లే అవుట్ ప్లాట్లను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని ప్లాట్లను ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్వాసితులకు కేటాయించగా, మిగిలినవి అమ్మేందుకు వీలుగా తీర్చిదిద్దనున్నారు.
దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ లే అవుట్లో మౌలిక వసతులు కల్పనకు టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. అంతర్గత రోడ్లు, మురుగునీటి కాల్వలు, తాగునీరు, అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. కాగా, హెచ్ఎండీఏ పరిధిలో భూముల వేలానికి యోచిస్తున్న సర్కారు.. ఆగస్టులో సవరించిన మార్కెట్ ధరకు అనుగుణంగా ఈ వేలంలో ప్లాట్లను విక్రయించేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ లోపు మౌలిక వసతుల కల్పన పూర్తి చేసేలా హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో నిర్వహించిన వేలంపాటలో మిగిలిన ప్లాట్లను కూడా మార్కెట్లో పెట్టనున్నారు.