HMDA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ చేపట్టనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు పరిహార చెల్లింపు నగదు రూపంలోనే జరగనుంది. గతంలో టీడీఆర్ రూపంలో పరిహారం చెల్లించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైనా… క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో నగదు రూపంలోనే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది.
నార్త్ సిటీ మీదుగా రెండు ఎలివేటెడ్ కారిడార్లను దాదాపు రూ. 12వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలోని డెయిరీ ఫాం రోడ్డు వరకు మొత్తంగా 23 కిలోమీటర్లు పొడువైన ఎలివేటెడ్ కారిడార్ రానుంది. ఇందులో ఒక వైపు డబుల్ డెక్కర్ రానుండగా, మరోవైపు అతి తక్కువ పొడవైన టన్నెల్ రోడ్డును హెచ్ఎండీఏ నిర్మించనుంది. అయితే ప్రాజెక్టు కోసం ఓవైపు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు పరిహారం, రోడ్డు వెడల్పు అంశంపై స్థానికులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా.. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూముల సేకరణకు అటు మేడ్చల్, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి హెచ్ఎండీఏ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నవారికి పరిహారం నగదు రూపంలోనే చెల్లించాలనే ప్రతిపాదనకు ఖరారైనట్లుగా తెలిసింది. గతంలో టీడీఆర్ రూపంలో పరిహారం చెల్లించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైనా… క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే విధంగా ప్రాజెక్టు వెడల్పుపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతూనే ఉంది. అయితే పరిహారం ఇప్పటికీ కొంతమంది కోల్పోతున్న భూమికి సమానంగా అభివృద్ధి చెందిన లే అవుట్లలో ఓపెన్ ప్లాట్లు ఇవ్వాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పరిహారాన్ని నగదు రూపంలో చెల్లించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో… రూ. 150 కోట్లు మేర ప్రాథమిక దశలో పరిహారం చెల్లించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
నార్త్ సిటీకి రవాణా సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఎలివేటెడ్ కారిడార్‌కు పరిహారాన్ని నగదు రూపంలోనే చెల్లించనున్నారు. రెండు మార్గాల్లో 23 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టు కోసం రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని హెచ్ఎండీఏ అంచనా వేసింది. రోడ్డుకు ఇరువైపులా 200 ఫీట్ల మేర ఆస్తులను సేకరించేందుకు ఇప్పటికే గుర్తించిన ప్రాంతంలోని ఆస్తి యజమానులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. దీనికోసం ఓవైపు అభిప్రాయం కోరుతూనే మరోవైపు గ్రామ సభల ద్వారా భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణను ఆయా జిల్లాల యంత్రాంగం చేపడుతోంది. దీనిలో మేడ్చల్ జిల్లాలో 380 ఆస్తులకు, హైదరాబాద్ జిల్లాలో మరో 350-400 ఆస్తులకు పరిహారాన్ని టీడీఆర్‌కు బదులు నగదు రూపంలోనే చెల్లించే అవకాశం ఉంది.
నిజానికి ఈ రెండు ప్రాజెక్టుల కోసం నగదు రూపంలోనే పరిహారం చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది. కానీ ఈ విధానం హెచ్ఎండీఏకు ఆర్థికంగా భారమేనని చెప్పాలి. ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే.. భూములు కోల్పోతున్న వారికి టీడీఆర్ రూపంలో పరిహారం చెల్లించాలనే ప్రతిపాదించారు. కానీ ఇటీవల జరిగిన పలు గ్రామ సభల్లో టీడీఆర్ కంటే నగదు రూపంలోనే పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. దీంతో టీడీఆర్ స్థానంలో నగదు రూపంలో పరిహారం చెల్లింపు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో… ఈ నిర్ణయం ఇప్పుడు ఆర్థికంగా భారంగా మారనుంది. మొత్తం ప్రాజెక్టులో దాదాపు 1000 కోట్లు పరిహార చెల్లింపులకు అవుతుందనే అంచనాలు ఉండగా.. ఇదంతా కూడా నగదు రూపంలోనే చెల్లించనున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికీ స్థానికుల నుంచి పలు డిమాండ్లు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. భూములు కోల్పోతున్న వారికి పరిహారం ఇప్పటికీ కొంత మంది కోల్పోతున్న భూమికి సమానంగా డెవలప్ చేసిన ప్లాట్లను పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ, రక్షణ శాఖలకు పరిహారంగా భూ బదలాయింపు చేయనున్నారు. అదేవిధంగా ఇరువైపులా 200 ఫీట్లకు బదులుగా కేవలం 100-150 ఫీట్ల మేర భూ సేకరణ చేయాలని డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తం అవుతుంది.