సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం నుంచి ఉత్తర తెలంగాణ వైపు నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లోని ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు రాజీవ్ రహదారిపై, ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి మిలిటరీ డెయిరీ ఫామ్ వరకు నిర్మించే రెండు ఎలివేటెడ్ కారిడార్ల కోసం అవసరమైన స్థలాలను గుర్తించడంతో పాటు మార్కింగ్ పనులను పూర్తి చేశారు. రెండు ఎలివేటెడ్ కారిడార్లలో రక్షణ శాఖకు చెందిన భూములు ఉండటంతో వేర్వేరుగా, మిగతా భూములు ప్రజలకు చెందిన వాటిని గుర్తించారు. ఈ రెండు కారిడార్లలో కలిపి మొత్తం రూ.2300 కోట్ల వరకు ఆస్తుల సేకరణకే వ్యయం అవుతుందని హెచ్ఎండీఏ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో సుమారు రూ.300 కోట్ల వరకు రక్షణ శాఖకు సంబంధించిన భూముల కోసం చెల్లించాల్సి ఉంటుంది. కాగా ప్రైవేటు ఆస్తుల సేకరణకు చెల్లించాల్సిన మొత్తాన్ని టీడీఆర్ లేదా నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంటుందని, రెండు మార్గాల్లో మొత్తం ఆస్తుల గుర్తింపు పూర్తి చేసిన తర్వాత నోటీసులు జారీ చేస్తామని ఓ అధికారి తెలిపారు.