సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పదకొండు నెలల రేవంత్ సర్కారు హయాంలో హెచ్ఎండీఏ ఖజానా కుదేలవ్వడంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో ఆయువుపట్టులాంటి ప్రణాళిక విభాగం నిర్వీర్యమైంది. దీంతో ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. పదకొండు నెలల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనిని చేపట్టలేకపోయిన హెచ్ఎండీఏ… చివరకు కీలకమైన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి నిధులు లేక దిక్కులు చూస్తున్నది. ఒకవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాక… మరోవైపు ఖజానాలో కాసులు లేక… ప్రాజెక్టు కించిత్తు కూడా ముందుకు కదలడం లేదు. దీంతో పాటు రక్షణ శాఖ భూములకు బదులుగా 676 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కేంద్రానికి బదలాయించాల్సి ఉండగా… ఒకేచోట ఇంత విస్తీర్ణం కావాలనే రక్షణ శాఖ షరతుతో భూ బదాలాయింపు ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు.
ఉత్తర తెలంగాణకు వెళ్లే వారితో పాటు సికింద్రాబాద్-కంటోన్మెంట్-మల్కాజిగిరి-మేడ్చల్ ప్రాంతాల్లోని వాహనదారుల ట్రాఫిక్ ఇక్కట్లను తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ ప్రాజెక్టును రూపొందించారు. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం వరకు సుమారు ఐదు కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు దాదాపు 13 కిలోమీటర్లు… ఇలా రెండు మార్గాల్లో సుమారు 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూసేకరణ సహా రూ.ఏడు వేల కోట్ల వరకు ఖర్చవుతుందని గతంలోనే అంచనా వేశారు.
ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా సిద్ధం చేశారు. కానీ కేంద్రం సహకరించకుండా రక్షణ శాఖ భూములు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. దీంతో గత ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పటివరకు ప్రాజెక్టులో కించిత్తు పురోగతి లేదు. చివరకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన దరిమిలా కనీసం భూ బదలాయింపు ప్రక్రియను కూడా పూర్తి చేయలేకపోయారు. గత తొమ్మిది నెలలుగా హెచ్ఎండీఏ నిధులు లేక కన్సల్టెంట్ల వేటలో పడిపోయింది. మొదటిసారి స్పందన రాకపోవడంతో రెండోసారి కూడా టెండర్లు పిలిచారు. కానీ ఇప్పటివరకు కన్సల్టెంట్ల ఎంపిక పూర్తి కాలేదు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం నుంచి నెలకు రూ110-200 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. మరోవైపు రియల్ రంగం కూడా మంచి జోరు మీద ఉండటంతో హెచ్ఎండీఏ చేపట్టిన వేలం ప్రక్రియలన్నీ రికార్డులు నమోదు చేసి వేల కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో రేడియల్ రోడ్లు, లింకు రోడ్లు, థీమ్ పార్కులు, పచ్చదనం పెంపు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను హెచ్ఏండీఏ చేపట్టేది. ఏటా రూ.2వేల కోట్ల వరకు పనులు పూర్తి చేసేది.
కాంగ్రెస్ పాలనలో ప్రణాళిక విభాగం పూర్తిస్థాయిలో నిర్వీర్యమైంది. బహుళ అంతస్తుల నిర్మాణ అనుమతులు, భూ వినియోగ మార్పు అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. షాడో నేతల నీడలో హెచ్ఎండీఏ విలవిలలాడుతున్నది. ఆ ముగ్గురు గ్రీన్‌సిగ్నల్ ఇస్తేగానీ అధికారులు అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రణాళిక విభాగం ఆదాయం ఇప్పుడు రూ.50 కోట్ల కంటే తక్కువకు పడిపోయింది. ఈ ఆదాయం నెలవారీ జీతభత్యాలు, నిర్వహణకే సరిపోతుండటంతో అభివృద్ధి పనులకు చిల్లిగవ్వ ఖర్చు చేయలేని స్థితి
లో హెచ్ఎండీఏ చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ల ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టాలా? లేదా బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్పర్ (బీవోటీ) విధానంలో చేపట్టాలా? కాస్త సలహాలివ్వండి అంటూ కన్సల్టెంట్ల నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆ కన్సల్టెంట్ ఎంపిక కోసమే ఇప్పుడు టెండర్లను పిలిచారు. హెచ్ఎండీఏ గతంలో అధికార యంత్రాంగమే పూర్తిస్థాయిలో ప్రాజెక్టులు డిజైన్ చేసి, పర్యవేక్షణ చేసి, పూర్తి చేసే స్థితి నుంచి ఇప్పుడు ప్రైవేటు కన్సల్టెంట్లు ఎలా చెబితే అలా చేయాలనే దుస్థితికి చేరింది.
హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం నుంచి ప్రతి నెలా రూ.100-110 కోట్ల ఆదాయం. ఒక్కో నెల రూ.200 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చేది. ఇలా ఏటా సుమారు రూ.12-24వేల కోట్ల వరకు ఆదాయం సమకూరేది. అందుకే ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు హెచ్ఎండీఏ పరిధిలో రూ.2000-2500 కోట్ల వరకు అభివృద్ధి పనులకు ఆ సంస్థ నిధులను వెచ్చించేది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంలో ఎకరా రూ.100 కోట్లు పలికిన చరిత్ర నమోదైంది.
పదకొండు నెలలుగా హెచ్ఎండీఏ ఆదాయం గణనీయంగా పడిపోయింది. నెలకు రూ.50 కోట్ల కంటే తక్కువ ఆదాయం వస్తున్నది. వచ్చే నిధులు నిర్వహణ, ఇతరత్రా వాటికే సరిపోతున్నది. దీంతో హెచ్ఎంఏడీ పరిధిలో ఒక్క అభివృద్ధి పనికి నిధులు వెచ్చించే పరిస్థితి లేదు. పదకొండు నెలలుగా ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు పురుడుపోసుకున్న దాఖలాలు లేవు. చివరకు సికింద్రాబాద్-కంటోన్మెంట్ పరిధిలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాల కోసం నిధులు లేక అధికారులు దిక్కులు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఎలా చేపట్టాలి? నిధులు ఎక్కడి నుంచి తేవాలి? కాస్త దారి చూపండంటూ ప్రైవేటు కన్సల్టెంట్లను ఎంపిక కోసం అధికారులు అన్వేషణ చేపట్టారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రియల్ రంగం ఢమాల్ అనడంతో సెంటు భూమిని వేలం వేయాలన్నా అధికారులు జంకుతున్న పరిస్థితి. ఇదీ… హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దుస్థితి.