సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : భూముల వేలం రూపాయి రాలేదు. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇక ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ఎలా అనేది ఇప్పుడు హెచ్ఎండీఏకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. నగరంలో వందకు పైగా ప్లాట్లను వేలం వేయడం ద్వారా రూ. 500 కోట్ల వస్తుందని ఆశపడితే.. రూ. 50 కోట్లు రెవెన్యూ కూడా లేకపోవడంతో ఇప్పుడు హెచ్ఎండీఏ తలలు పట్టుకుంది. దీంతో భవిష్యత్‌లో భూముల వేలంపై నీలినీడలు కమ్ముకోగా, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిధుల సర్దుబాటు ఎలా అనేది కూడా సమస్యగా మారింది.
ఆశలు ఆవిరి..
వందల కోట్లు సర్దుబాటు చేసుకోవాలనే లక్ష్యంతో అట్టహాసంగా చేపట్టిన భూముల వేలంతో హెచ్ఎండీఏ అభాసుపాలైంది. అంచనాలను ఏమాత్రం చేరుకోకుండానే బొక్కా బోర్లా పడింది. దీంతో నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేయడంతోపాటు, భూముల వేలంపై వచ్చే రెవెన్యూపై సర్కారు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 103 ప్లాట్లను వేలానికి సిద్ధం చేసి రెండ్రోజుల పాటు ఈ వేలం నిర్వహించగా, ఇందులో మూడు ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోగా, వీటి ద్వారా హెచ్ఎండీఏ ఖజానాకు వచ్చిన ఆదాయం రూ. 50 కోట్ల లోపే.
రియల్ డౌన్‌కు నిదర్శనం…
గడిచిన రెండేండ్లుగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో క్రయవిక్రయాలు లేవు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అమలు చేసిన విధి విధానాలు కూడా భూముల వేలంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలు, బిల్డర్లపై సాగిన ప్రతీకార చర్యలు భూముల వేలానికి పెద్ద అడ్డంకిగా మారింది.
ఇక ప్రణాళిక లేని విధానాలు కూడా వేలానికి శాపంగా మారాయి. దీనికి తోడు భూముల వేలంపై ప్రచారం నిర్వహించడంలో హెచ్ఎండీఏ నిర్లక్ష్యం వహించడం కూడా భూముల వేలంపై జనాలకు ఆసక్తి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా నగరంలో పడిపోయిన రియల్ ఎస్టేట్‌కు నిదర్శనంగా నిలుస్తుండగా… భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏ చేసిన విఫల ప్రయోగానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
24వేల కోట్లు..
గతంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న వాణిజ్య సముదాయాలను విక్రయించడం లేదా, తనాఖా పెట్టడం ద్వారా రూ. 24వేల కోట్లు సమీకరించాలని భావించింది. దీనికి ఓ ఏజెన్సీని నియమించుకున్నది. కానీ ఆ సంస్థ నుంచి ఆశించిన స్థాయి పురోగతి లేక చేతులెత్తివేసింది. దీంతో రూ. 24వేల కోట్ల సమీకరణలో హెచ్ఎండీఏ విఫలమైంది. ఇక భూముల వేలం ద్వారా రూ. 500 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదనలతో రంగంలోకి దిగింది. కానీ ఇక్కడ కూడా హెచ్ఎండీఏ వ్యూహం బెడిసికొట్టినట్లుగా అత్తెసరు స్పందన రావడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని దిక్కులు చూసే పరిస్థితి నెలకొంది.