సిటీబ్యూరో/ఎల్బీనగర్/అమీర్‌పేట్/చిక్కడపల్లి, మే 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ జనాభా కోటికి పైగా పరుగులు తీస్తున్నది. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి లక్షలాది మంది వలస వస్తుంటారు. చాలా వరకు వీరిలో ఫుడ్ ఇండస్ట్రీనే మొదటి ఉపాదిగా ఎంచుకుని జీవనం కొనసాగిస్తుంటారు. కొందరు హాస్టళ్లు ఏర్పాటు చేస్తే.. మరికొందరూ హోటల్స్, రెస్టారెంట్స్‌లో పనిచేస్తారు. ఇంకొందరూ సొంతంగా స్ట్రీట్ ఫుడ్ బండ్లు, క్యాటరింగ్ సెంటర్లు ఇలా అనేక రకాలుగా ఉపాధిని సొంతంగా ఏర్పా టు చేసుకుంటారు. వీటిని ఆధారంగా చేసుకొని వేలాది మంది అందులో కార్మికులుగా ఉపాది పొందుతారు.
పరోక్షంగా డెలివరీ బాయ్స్ ఆర్డర్స్ చేరవేస్తూ వేలాది మంది బతుకుబండి సాగిస్తుంటారు. మొత్తంగా ఈ ఫుడ్ ఇండస్ట్రీపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ప్రశాంతంగా సాగుతున్న ఈ ఆహార రంగంపై కేంద్ర ప్రభుత్వం ‘సిలిండర్’ ధరలు పెంపుతో పిడుగు వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.993 పెంచి ఫుడ్ ఇండస్ట్రీ మనుగడను ప్రశ్నార్థకం చేసింది. ఫలితంగా నగరంలోని వ్యాపారాలు షట్‌డౌన్ అంచునకు చేరుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు హాస్టళ్లలో మెనూ మారిపోయింది. గతంలో హస్టళ్లలో ఉండే వారి ఇష్టాలకు అనుగుణంగా టిఫిన్స్, మధ్యాహ్నం భోజనంలో ఇష్టమైన కూరలు, రాత్రి వారి అభిరుచులకు అనుగుణంగా తయారు చేసి పెట్టే వారు.
ఇటీవలే యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో వచ్చిన కష్టాలతో కట్ అయిన మెనూ, తాజా గ్యాస్ ధరల పెంపుతో మరోసారి పునరావృత్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గ్యాస్ భారంగా మారింది కదా కట్టెల పొయ్యి అయినా పెడదామంటే నగరంలో ఈ కట్టెల పొయ్యి ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో మాకు కష్టంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లు, హోటళ్లలో గ్యాస్ బండ ధర పెంపుపై ఆవేదనతో పాటు నిస్సాహయత వ్యక్తం చేస్తున్నారు. ఈ భారం వందకుపైగా ఉన్న హస్టళ్ల వారితో పాటుగా గల్లీకో టీ కొట్టు, హోటల్ నిర్వాహకులతో పాటుగా అన్ని చిరు వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.

Gas
ధరల పెంపు..!
టీ కొట్లు, స్వీట్ షాపులు, చిరుతిళ్ల బండ్లు , ఇతర తినుబండారాలను తయారు చేసి విక్రయించే చిరు వ్యాపారులు తాము బతకడం కష్టమని భావిస్తున్నారు. తమను బతకనియ్యలేక బాధ పెడుతున్నారంటూ వారు వాపోతున్నారు. గ్యాస్ ధరల పెంపుతో హాస్టళ్లు, హోటళ్లు, స్వీట్ షాపుల వారు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే టీ షాపుల్లో ఒక్కో టీ వెనుక రెండు రూపాయలు పెంచిన వ్యాపారులు ఆపై పెంచితే తమ వ్యాపారాలు నడవవంటూ పేర్కొంటున్నారు. ఇక టిఫిన్ షాపుల విషయానికి వస్తే రూ. 25 నుంచి రూ. 30 రూపాయలు ప్లేట్ చేశారు. కొందరు రూ.40 నుంచి రూ. 60 వరకు పెంచారు. ఇప్పుడు గ్యాస్ ధర పెరిగిందని మరింత పెంచితే తమ వ్యాపారాలు సాగవంటున్నారు.
కట్టెలపొయ్యే దిక్కు ..
గ్యాస్ బండ ధర పెంపుతో చెప్పలేని భారం. ఈ భారాన్ని మోస్తే మేం నష్టాల్లోకి వెళ్తాం. ఆవరేజీగా తీసుకుంటే ఇప్పటివరకు రోజుకు రూ. 600 ఖర్చు అవుతుంటే ప్రస్తుతం రోజుకు రూ. 1200 ఖర్చు అవుతుంది. ఇలా గ్యాస్ బండతో పాటుగా కూరగాయలు, నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరగడంతో మరింత భారం అవుతున్నది. అయినా వదిలిపోలేం. హాస్టళ్లలో ఉండే వారికి అన్ని విధాలుగా మాట ఇచ్చి నడుపుతున్నాం. వారికి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలి. హాస్టళ్ల భవన యజమానులకు ఇచ్చిన అడ్వాన్స్, అద్దె నేపథ్యంలో తడిసి మోపెడు అయినా నిర్వాహణ చేయాల్సిన పరిస్థితి ఉంది. అవకాశం ఉన్న దగ్గర కట్టెల పొయ్యిని వాడి వంట చేస్తున్నాం. మెనూ కొంత మార్పులు చేసి నడుపుతున్నాం.
– కె.కె. రెడ్డి , దిల్సుఖ్నగర్..రెడ్డి హాస్టల్స్ నిర్వాహకుడు
భారం వేస్తున్నారూ…బతకనిస్తలేరు
గ్యాస్ బండ భారం వేసి బతకనివ్వడం లేదు. ఇప్పటికే దందాలు లేక అవస్థలు పడుతుంటే మా నెత్తిన గుదిబండ వేశారు. గ్యాస్‌పై వెయ్యి పెంచి మమ్మల్ని ఆప్పుల పాలు చేస్తున్నారు. ఇటీవలే గ్యాస్ కొరత నేపథ్యంలో గిరాకీని సెట్ చేసి అప్పులు చేసి, ఫైనాన్స్ తీసుకుని నడుపతుంటే తీరా గ్యాస్ బండ ధర పెంచి మాపై మరింత భారం మోపారు. మా టీ ధరలు పెంచితే గిరాకీ రాదు. ఇలాగే కొనసాగిస్తే మరింత అప్పు అవుతుంది. సమోస, బజ్జీలు చేయాలంటే కూడా గ్యాస్ ధర పెంపుతో భయమవుతున్నది.
– రాంచందర్, టీ కొట్టు నిర్వాహకుడు, దిల్సుఖ్నగర్
అద్దె చెల్లించడం సమస్యగా మారింది
గ్యాస్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్లేట్ మీల్స్ రూ. 60 నుంచి ఇప్పటికే రూ.80 చేశాం. ఈ పెరిగిన ధరలతో వ్యాపారం సజావుగా సాగడం లేదు. మళ్లీ సిలిండర్ ధరలు కేంద్రం పెంచడం బాధాకరం. బుక్ చేస్తే అవసరానికి రాదు. బ్లాక్‌లో కొనాలంటే రూ.7-10వేల వరకు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి గ్యాస్ కొనుగోలు చేస్తే ధరలు మరింత పెంచాల్సి వస్తుంది. వ్యాపారం నష్టపోతాం. అద్దె చెల్లించడానికి ఇబ్బందిగా ఉంది. గ్యాస్ ధరలు తగ్గించేల కేంద్రం చర్యలు తీసుకోవాలి.
– సంపత్, మెస్ నిర్వాహకుడు