Madapur | మాదాపూర్, మార్చ్ 5: నూతనంగా ప్రారంభం చేసే వ్యాపార సముదాయాలు, గృహాలు, ఇతర శుభకార్యాలు జరిగే చోటుకు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఎవరికి తోచినంత వారు ఇచ్చి హిజ్రాలను అక్కడ్నుంచి పంపించేస్తుంటారు. అయితే త్వరలోనే వచ్చే హోలీ పండుగను దృష్టిలో ఉంచుకుని ఓ రెస్టారెంట్ వద్దకు వెళ్లిన హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేశారు. వారు డిమాండ్ చేసినంత డబ్బు ఇచ్చేందుకు రెస్టారెంట్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆగ్రహాంతో హిజ్రాలు.. రెస్టారెంట్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని తాజా కిచెన్ రెస్టారెంట్లో ఈ నెల 4 వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో ముగ్గురు హిజ్రాలు తాజా కిచెన్ వద్దకు వచ్చి హోలీ పండగ వస్తుందని డబ్బులు అడిగారు. దీంతో రెస్టారెంట్ యాజమాని కస్టమర్స్ ఉన్నారని 10 నిమిషాలు ఆగమని చెప్పాడు. సరే అని పక్కన నిలబడ్డారు. కాసేపయ్యాక రెస్టారెంట్ యాజమాని రాఘవేందర్ రూ. 500 ఇస్తుండగా.. ఎలా కనిపిస్తున్నాము. మాకు గ్రూపుకు మొత్తం కలిపి రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశారు.
దీంతో యాజమాని అంత ఇవ్వడం కుదరదని చెప్పగా ముగ్గురు హిజ్రాల్లో ఒకరు అక్కడున్న స్టీల్ డస్ట్ బిన్‌తో యాజమాని రాఘవేందర్ తలపై బలంగా కొట్టారు. తల, ముక్కుకు గాయాలై తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో రెస్టారెంట్ సిబ్బంది యజమానిని సమీప దవాఖానకు తీసుకెళ్లారు. అనంతరం రెస్టారెంట్ క్యాషియర్ వినయ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో దాడి చేసిన హిజ్రాలపై ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.