Hyderabad | సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఓ వైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న జీవనశైలి.. మరో వైపు నగరంలో రూపాంతరం చెందుతున్న పని విధానం, సంస్కృతి విషయాల్లో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో హైదరాబాద్ ‘నిద్రపోని మహానగరం’ జాబితాలో చేరేందుకు జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతున్నది. సామాజిక జీవన విధానం రూపాంతరం చెందుతుండటమే ఇందుకు కారణం. సాధారణంగా నగరంలో పగటిపూట శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌తోపాటు అబిడ్స్, తార్నాక, జేఎన్టీయూ లాంటి పలు ప్రాంతాలు పగటి పూట శబ్ద స్థాయిలను అధిగమించేందుకు పోటీపడుతుండటం గమనార్హం.
వృత్తిపరమైన జీవన విధానమే కారణం..
పగటి ఫూట కంటే రాత్రిళ్లు ఎక్కువగా పనిచేయడం లాంటి వృత్తిపరమైన జీవన విధానం శబ్ద మోతాదు స్థాయి పెరగడానికి ఒక కారణంగా పలువురు పర్యావరణ వేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా నెహ్రూ జూలాజికల్ పార్కు (జూపార్కు) సమీపంలో కూడా శబ్ద తీవ్రత స్థాయిలను కనుగొన్నట్లు టీఎస్‌పీసీబీ రిపోర్టు వెల్లడించింది.
అత్యధికంగా 72.53 డెసిబుల్స్ అక్కడే నమోదు..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్ని ప్రాంతాలు పగటిపూట కంటే రాత్రి సమయంలో అధిక శబ్ద స్థాయిలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. అత్యధికంగా 72.53 డెసిబుల్స్ నమోదవుతున్న ప్రాంతంగా జూబ్లీహిల్స్ నమోదైంది. ఈ ప్రాంతంలో అనేక రెస్టారెంట్లు, విశ్రాంతి ప్రదేశాలు, ఫ్యాషన్ స్టోర్స్‌తోపాటు రిక్రియేషన్ సెంటర్లతోపాటు రాత్రివేళల్లో నిర్వహించే సముదాయాలు ఉండటం ఇందుకు కారణమని టీఎస్‌పీసీబీ రిపోర్టు పేర్కొన్నది. రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల మధ్య 45 డిసిబుల్స్ శబ్ద ప్రమాణాన్ని కలిగి ఉండాలని, కానీ ఇందుకు భిన్నంగా స్థిరమైన స్థాయిలో గత శుక్రవారం అత్యధిక మోతాదులో శబ్ద స్థాయి 72.53 డిసిబుల్స్గా నమోదైనట్లు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అదేరోజు పగటిపూట 69.51గా నమోదైనట్లు పేర్కొన్నది.