Rain Fall | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజామున వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు బస్తీల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. సెల్లార్లు కూడా నీట మునగడంతో స్థానిక నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలు అతలాకుతలం అయ్యారు.
ఇక శేరిలింగంపల్లిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అత్యధికంగా 148.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగంపల్లి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వద్ద 114.3 మి.మీ., చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియం వద్ద 109.8 మి.మీ., గచ్చిబౌలిలో 81.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక అత్యల్పంగా బండ్లగూడ పరిధిలోని మేకలమండి కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో 27.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రధానంగా శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. బ్రిడ్జికి ఇరువైపులా వరద నీరు ముంచెత్తడంతో పూర్తిగా ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాపిరెడ్డి కాలనీ రాకపోకలు సైతం నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లింగంపల్లి తారా నగర్ పాపిరెడ్డి కాలనీ ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. లింగంపల్లి మెహదీపట్నం ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. డోయాన్స్ కాలనీ సమీపంలో పెట్రోల్ బంకు, ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతు వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి మాదాపూర్ ఐటీ కారిడార్ లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, వాహనదారులను హైడ్రా అధికారులు ట్రాఫిక్ పోలీసులు దారి మళ్ళించారు.