సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ): అంబర్‌పేటలోని బతుకమ్మకుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా మంగళవారం తన తుది తీర్పులో బతుకమ్మకుంటగానే గుర్తిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. బతుకమ్మకుంట తమదంటూ ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు కుంట పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమమేనంటూ తీర్పునిచ్చిందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే బతుకమ్మకుంటకు పూర్వవైభవం తీసుకొస్తామని, 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మకుంట ఉందని, బఫర్‌జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణంగా తేల్చారని రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15ఎకరాల భూమిలోనే బతుకమ్మకుంటను పునరుద్ధరిస్తామని రంగనాథ్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-52లోని నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో ప్రభుత్వ స్థలం, పార్కులు, గురుబ్రహ్మనగర్ బస్తీ ప్రాంతాల్లో డబుల్బెడ్రూంలు నిర్మించేందుకు కేటాయించిన స్థల ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.