సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్సిటీ) పాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి.. ఇప్పటికే రూ.1090 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించ తలపెట్టిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ పనులకు గతేడాది డిసెంబర్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి..ఏడాది కావొస్తున్న పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదు..భూ సేకరణపై అడుగడుగునా అవాంతరాలు, న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి..ఈ తరుణంలోనే బంజారాహిల్స్ విరించి దవాఖాన నుంచి అగ్రసేన్ జంక్షన్, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను రెండు వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, భూ సేకరణ అధికారి జీహెచ్ఎంసీ, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఖైరతాబద్ జోనల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 24ను వాయిదా వేసింది. విరించి హాస్పిటల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు 100, 120 అడుగుల ఆర్డీపీ వరకు వెడల్పు చేయబడిన రోడ్డు భాగంలో బీటీ రోడ్డు వేసేందుకు రూ. 150 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించింది. ఏజెన్సీ ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు.
ఐతే భూసేకరణపై స్పష్టత లేకుండానే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడం, అందులో భూ సేకరణ విభాగం అధికారుల నోటీసులో లేకుండా టెండర్లు పిలిచిన తీరు చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో రహదారి విస్తరణకు ఆస్తుల స్వాధీనంపై స్పష్టత లేదు. 16 చోట్ల ఆస్తులను భూ సేకరణ విభాగం అధికారులు యాజమానులకు సీ నోటీసులు జారీ చేశారు. మరో 16 చోట్ల ఆస్తుల స్వాధీనానికి యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల ఆస్తుల స్వాధీనంలో గుర్తింపు ప్రక్రియ జరుగుతున్నది. ఈ ప్రాజెక్టుకు ముందు నుంచి సరైన ప్రణాళిక లోపించింది. భూ సేకరణపై విధి విధానాలు రూపొందించకపోవడం, ఈ ప్రాజెక్టు కింద సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడం భూ సేకరణపై ఎలాంటి స్పష్టత లేకుండా ముందుకు సాగారు. ఫలితంగా క్షేత్రస్థాయిలోకి దిగిన అధికారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి.