ఖైరతాబాద్, మే 27 : న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని హైకోర్టు న్యాయవాది భానుమూర్తి బాల డిమాండ్ చేశారు. హైదరబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులు సామాన్యులకు న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని, కాని తమకు ఎలాంటి రక్షణ చట్టాలు లేకపోవడం వల్ల దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయస్థానాలు, న్యాయవాద సంఘాలు బాధిత న్యాయవాదులకు అండగా నిలబడాలని భానుమూర్తి బాల కోరారు. న్యాయస్థానాల్లో అనేక కేసులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయని, ఫలితంగా ఒక్కోసారి క్లయింట్లే న్యాయవాదులపై దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. సత్వర న్యాయంపై దృష్టిపెట్టాలని, కోర్టుల్లో కేసు కేసుల లిస్టింగ్ త్వరిగతిన జరిగేలా చూడాలని, ప్రభుత్వం తరపున కౌంటర్లు వేగంగా దాఖలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. న్యాయవాదులకు నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తప్పుడు కేసులను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత న్యాయ సహాయం, ఆర్థిక సాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కోర్టుల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది సంఖ్య పెంచాలని, పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.