సైదాబాద్, నవంబర్ 30: సమాజంలో నిరాదరణకు గురైన చిన్నారులకు విద్య, వసతి, రక్షణ, అనువైన వాతావరణం కల్పించి ప్రోత్సహించాలని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా అన్నారు. శనివారం సైదాబాద్‌లోని రాష్ట్ర బాలల సంక్షేమం, సంస్కరణల శాఖ (జువైనల్ హోం డిపార్టుమెంట్) ఉప సంచాలకులు డాక్టర్ మిర్జా రజాక్ అలీ బేగ్ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు, సత్కార సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనాధ, వీధి బాలలకు వసతి, విద్య, మానసిక పరివర్తనలో మార్పులు తీసుకొచ్చి వారిని ప్రోత్సహించాలన్నారు.
చిన్నారుల ఉజ్వల భవిషత్తు సరైన మార్గంలో నడుచుకున్నప్పుడే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల హక్కుల పరిరక్షణతోపాటు వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జువైనల్ చిన్నారుల కోసం మిర్జా బేగ్ చేసిన సేవలు వారి ఉజ్వల జీవితానికి ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని రాష్ట్ర బాలల సంక్షేమం, సంస్కరణల శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ అన్నారు. కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ కిస్మత్ కుమార్, సుకుమార్, రాంచంద్రమూర్తి, కేశవులు, ఉప సంచాలకులు చర్వాక్, నవీన్‌కుమార్, గోపీకుమార్, జ్వాల, నాగేశ్వర్రావు, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.