హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఫాక్స్‌సాగర్ సరస్సు ఎఫ్ టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై ప్రస్తుతం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ కేసు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా దుండిగల్ -గండిమైసమ్మ మండలం దూలపల్లిలోని సర్వే నంబర్లు 118, 119, 122లోని భూములను నివాసయోగ్య భూములు కాదంటూ ఈనెల 7న జారీ చేసిన జీవోలు 186, 187లను సవాల్ చేస్తూ రోహన్ గుండాల హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫాక్స్ సాగర్ సరస్సు ఎఫ్ టీఎల్ పరిధిగా పేరొంటూ గతంలో జారీ చేసిన భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో హైడ్రా ఎప్పుడైనా నిర్మాణాలపై చర్యలు చేపట్టే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తదుపరి విచారణ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తూ ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని నిర్దేశించారు.