మేడ్చల్, జనవరి 2: విద్యార్థినులు స్నానాల గదిలో ఉండగా సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించారని ఆరోపిస్తూ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల హాస్టల్ విద్యార్థినులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఆందోళన గురువారం రాత్రి వరకు కొనసాగింది. విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు తరలివచ్చి, హాస్టల్ గేట్ ముందు బైఠాయించి, ఆందోళన చేశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కళాశాలకు అనుబంధంగా పక్కనే విద్యార్థినుల వసతికి హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. నాలుగు అంతస్తుల భవనంలో కింది అంతస్తులో మొదటి సంవత్సరం విద్యార్థినుల వసతికి ఏర్పాట్లు చేయగా.. పై అంతస్తుల్లో మిగితా విద్యార్థినులకు వసతి ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి డిసెంబర్ 31 సందర్భంగా విద్యార్థినులు రాత్రి వరకు మేల్కొని సంబురాలు జరుపుకున్నారు.
అనంతరం ఓ విద్యార్థిని స్నానాల గదిలోకి స్నానం చేయడానికి వెళ్లగా.. ఎవరో వెంటీలెటర్లో నుంచి సెల్ఫోన్లో చిత్రీకరించినట్టు, ఓ వ్యక్తి అటుగా వచ్చినట్టు నీడను గుర్తించి గట్టిగా అరిచింది. ఆ విద్యార్థిని హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి దృష్టికి తీసుకుపోవడంతోపాటు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి విద్యార్థినుల స్నానాల గదులను పరిశీలించగా.. వెంటీలెటర్ల వద్ద ఫింగర్ ప్రింట్స్ కన్పించాయి. అయితే వార్డెన్‌ను విచారించి, తగిన చర్యలు చేపట్టకపోగా.. విద్యార్థినులతో అనుచితంగా మాట్లాడారు. తల్లిదండ్రులకు కూడా పూర్తిస్థాయిలో భరోసానివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. వారికి విద్యార్థి సంఘాల నేతల మద్దతు పలుకడంతో ఆందోళన మరింత్ర తీవ్రమైంది.
హాస్టల్ కిచెన్‌లో పని చేసే బీహార్‌కు చెందిన సిబ్బందికి హాస్టల్ వెనుక భాగంలో నివాసానికి ఏర్పాట్లు చేశారు. వారు విద్యార్థినుల స్నానాల గదిలో ఉండగా వీడియో చిత్రీకరించే అవకాశం ఉన్నట్టు అనుమానిస్తూ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని 11 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తొలగించిన డేటా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐదుగురి సిబ్బందితోపాటు మెస్ ఇన్చార్జి, వార్డెన్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇప్పటి వరకు విద్యార్థినుల వీడియోలు, ఫొటోలు లభించలేదు. బయటకు కూడా రాలేదు. ఏసీపీ శ్రీనివారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోపణల నేపథ్యంలో హాస్టల్‌ను పూర్తిగా పరిశీలించామన్నారు. వెనుకవైపు మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం కన్పిస్తుందన్నారు. వెంటీలెటర్ల వద్ద ఉన్న ఫింగర్స్ ప్రింట్స్ కూడా సేకరించామన్నారు. పూర్తి విచారణ చేసి, నిందితులను గుర్తిస్తామని చెప్పారు. సీఎంఆర్ కళాశాల ప్రాంగణంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్, దుండిగల్, పేట్‌బషీరాబాద్ పోలీస్స్టేషన్ల నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది పహారా నిర్వహించారు.
మీడియాలో వచ్చిన వార్త కథనాల ఆధారంగా రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా ఈ ఘటనపై విచారణ చేపట్టింది. గురువారం సాయంత్రం సీఎంఆర్ ఐటీ కళాశాల లేడీస్ హాస్టల్‌కు మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజ చేరుకొని, విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆదేశాల మేరకు సుమోటో ఘటనను తీసుకొని, విచారణ చేపట్టామని తెలిపారు. కాగా సీఎంఆర్ యాజమాని గోపాల్ రెడ్డి విద్యార్థినులతో మాట్లాడారు. కళాశాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అన్ని చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారని, వేచిచూస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. అందుకనుగుణంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే విద్యార్థినులు ఆయన హామీలకు సంతృప్తి చెందలేదు. వార్డెన్ ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.