బంజారాహిల్స్, జూన్ 3: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎంబీఏ హాస్పిటల్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ (హెచ్హెచ్సీఎమ్) కోర్సును అందించడానికి నగరానికి చెందిన మూడు విద్యాసంస్థలతో అంబేద్కర్ వర్సిటీ అవగాహహన ఒప్పందాలు కుదుర్చుకుంది. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.ఘంటా చక్రపాణి సమక్షంలో అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, కిమ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, దారుస్సలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ విద్యాసంస్థలతో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. కార్పొరేట్ వైద్యరంగంలో అనేక మార్పులు వస్తున్న తరుణంలో బిజెనెస్ మేనేజ్మెంట్ కోర్సులో భాగంగా హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సును అందించడంతో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కోర్సులను అందించేందుకు గతంలో ఉన్న ఒప్పందాన్ని ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.ఎల్.విజయకృష్ణారెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ప్రొ.పుష్పా చక్రపాణి, డీన్ ప్రొ.ఆనంద్ పవార్, ప్రొ.కిరణ్మయితో పాటు అపోలో ప్రతినిధి డా.భాస్కర్‌రెడ్డి, కిమ్స్ ప్రతినిధి డా.రాజేంద్ర అన్నే, దారుస్సలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధి డా.మనీషా సక్సేనా తదితరులు పాల్గొన్నారు.