“అంబర్‌పేట్‌కు చెందిన విజయ్ హెల్మెట్ ధరించకుండానే… ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. నిబంధన ఉల్లంఘించినందుకు మార్గమధ్యలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటో తీసి.. ఈ చలాన్ వేశాడు. ఇది మన మంచికే అనుకున్న విజయ్.. అప్పటి నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాకే..బండి ఎక్కుతున్నాడు. ఇలా నగరంలో అనేక మంది.. ఒకసారి చలాన్ పడిందంటే.. మరోసారి ఆ తప్పు చేయకుండా.. ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు.
నగరవాసుల్లో పరివర్తన కనిపిస్తున్నది. ఒకసారి ఈ చలాన్ పడిందంటే.. ఆ జరిమానాను చెల్లిస్తూ..మరోసారి గీత దాటకుండా జాగ్రత్త పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు మన మంచి కోసమే కదా.. అని అవగాహన పెంచుకుంటున్నారు. రూల్స్‌ను చక్కగా పాటిస్తున్నారు. ఏడాదికి కోటికిపైగా వివిధ రూపాల్లో జరిమానాలు పడుతుంటే.. అందులో ఒకేసారి జరిమానా ఉన్న వాళ్లు 75 శాతం ఉండటం గమనార్హం. ఒక్కసారి ఈ చలాన్ పడిందంటే.. చాలా మంది మరో ఉల్లంఘనకు పాల్పడకుండా చూసుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయాలు కాకుండా ఉండేందుకు ద్విచక్రవాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ వాడాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ‘ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రమాదాలకు దూరంగా ఉండండి’ అంటూ.. తరచూ నగర పోలీసులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కొందరు మాత్రం నిబంధనలు బేఖాతరు చేస్తుండటంతో అలాంటి వారిపై కాంటాక్టు, నాన్ కాంటాక్టు విధానంలో జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాలతో ఒకవైపు.. సీసీ కెమెరాల ద్వారా మరోవైపు ఉల్లంఘనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు.
ఒక సారి ఉల్లంఘనకు పాల్పడిన వారు మరోసారి తమ వాహనంపై చలాన్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. వాహన యజమాని ఇతరులకు బండి ఇచ్చినప్పుడు సైతం హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజ ల్లో అవగాహన పెరుగుతుండటం శుభపరిణామం. – ఎల్ఎస్ చౌహాన్, ట్రాఫిక్ డీసీపీ