Hyderabad Rains | హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్, శేరిలింగంపల్లి, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, సికింద్రాబాద్, హబ్సీగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్‌లో వాన పడుతోంది. దీంతో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాత్రి, రేపు కూడా హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.