Traffic Jam | హైదరాబాద్ : హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నపాటి చిరుజల్లు కురిసినా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు.
తాజాగా పాతబస్తీ ప్రాంతమైన పురానాపూల్, పేట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్, హైకోర్టు, మదీనాతో పాటు అఫ్జల్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు గంటన్నర నుంచి ఒక్క వాహనం కూడా ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
ఇలా కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినప్పటికీ పోలీసులు స్పందించడం లేదు. అసలు పోలీసుల జాడనే కనిపించడం లేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు, ప్రయివేటు వాహనాల్లో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ప్రయాణికులు ధ్వజమెత్తుతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పోలీసులు ఎక్కడా..? అని నిలదీస్తున్నారు.