Hyd Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం మళ్లీ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం పడుతున్నది. సికింద్రాబాద్ పరిధిలోని బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, మారేడ్‌పల్లి, చిలుకలగూడ పడుతున్నది. హయత్‌నగర్ పరిధిలో భారీ వర్షపాతం రికార్డయ్యింది. వర్షానికి హయత్‌నగర్ హైవేపై వరద నీరంతా నిలిచిపోయింది. దాంతో జాతీయ రహదారిపై నీరు నిలువడంతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. అలాగే, హైదరాబాద్ నగర పరిధిలోని ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్, యూసుఫ్‌గూడ, బోరబండ, కూకట్పల్లి, హైదర్‌నగర్, ప్రగతినగర్, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, వివేకానందనగర్, ఆల్విన్‌కాలనీ, కుత్బుల్లాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్నది.
ఒక్కసారిగా హైదరాబాద్ నగరాన్ని కారు మబ్బులు కమ్మేసింది. ఒక్కసారిగా కురిసిన వానకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల వర్షం కారణంగా రోడ్లపై నీరంతా నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రాగల 24గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. రాత్రి 11గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు ప్రణాళికలను మేరకు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని.. అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని.. వర్షం కురిసే సమయంలో భారీ హోర్డింగులు, చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. వాహనాలు తక్కువ లోతైన రోడ్లలో మాత్రమే నడపాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.