Heavy Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, నాదర్గుల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్ రెడ్డి నగర్, ఉప్పల్ ఏరియాల్లో వాన దంచికొట్టింది. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ – విజయవాడ హైవేపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. పెద్ద అంబర్పేట్ నుంచి హైదరాబాద్ సిటీలోకి వెళ్లే రోడ్లపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. భాగ్యలత వద్ద నీటి నిల్వతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. పెద్ద అంబర్పేట్ నుంచి ఎల్బీనగర్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రంగారెడ్డి జిల్లా తొర్రూరులో అత్యధికంగా 116.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, నాదర్గుల్లో 80 మి.మీ., హయత్‌నగర్‌లో 75 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం సికింద్రాబాద్, తార్నాక, రామాంతపూర్, అంబర్‌ఫేట్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, నారాయణగూడ, రాజేంద్రనగర్, గోల్కొండ, మెహిదీపట్నం, బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సైదాబాద్‌లోని రెడ్డి కాలనీ నీట మునిగింది. వరద నీటిలో బయటకు వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు.