Hyderabad | హైదరాబాద్ : ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా హైదరాబాద్ మహా నగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. నగరమంతా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఈ భారీ వర్షానికి నగర ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన దంచికొడుతున్న నేపథ్యంలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 9000113667 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రధాన రహదారులు, కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్, గచ్చిబౌలి రోడ్లు జలమయం అయ్యాయి. రాయదుర్గం, కొండాపూర్‌లో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. మ్యాన్‌హోల్స్ మూసుకుపోవడంతో వర్షపు నీరు రోడ్లపై అలాగే నిలిచిపోయిందని వాహనదారులు పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైంది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ నీటి మునిగింది. స్థానికంగా ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. ఖైరతాబాద్ రైల్వే గేట్ వద్ద వరద నీరు దుకాణాల్లోకి చేరింది.
గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో వర్షపాతం గణనీయంగా పెరిగింది. సాధారణంగా జులై 20వ తేదీ నాటికి హైదరాబాద్ నగరంలో సగటున 101.2 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ ఏడాది ఈ సమయం నాటికి సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 122.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వారం చివర వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు.
గచ్చిబౌలిలో ఉదయం అర గంట సమయంలోనే 13 మి.మీ. వర్షపాతం నమోదైంది. మియాపూర్‌లో 12.5 మి.మీ., జీడిమెట్లలో 11.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ రాత్రికి కూడా నగర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నగర వాసులు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని సూచించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్వహించిన సమావేశానికి జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు హాజరయ్యారు. వాటర్ లాగింగ్, చెట్లు విరిగిపోయాయని వస్తున్న ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రోనాల్డ్ రాస్ హెచ్చరించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలు ఉండకూడదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో డీఆర్ఎఫ్ బృందాలు ఆ చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.