సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ)/ ఖైరతాబాద్ : ఎండ తీవ్రత…ఉక్కపోతతో తల్లడిల్లిన గ్రేటర్ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తడిసిముద్దయింది. మొదట నగరానికి పడమర, ఉత్తరం దిక్కున ఉరుములు, మెరుపులతో వర్షం మొదలై క్రమక్రమంగా తూర్పు వైపు విస్తరించింది. ఈ క్రమంలో భారీ ఈదురు గాలులతో దంచికొట్టిన వాన కారణంగా పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సైతం స్తంభించింది. గంటకు 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. రామచంద్రాపురంలో అత్యధికంగా 7.98 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ష భీభత్సంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
బయటకు రావొద్దని, ఇండ్లలోనే ఉండాలని సూచించారు. మంగళవారం ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపగా రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్ చెరు, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, బషీర్బాగ్, నల్లకుంట, నాచారం, ఓయూ, మణికొండ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాలు వర్షంతో జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండలతో విలవిలలాడిన నగర ప్రజలకు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం ఉక్కపోత నుంచి ఉపశమనం కల్పించింది.
భాగమతికి తప్పిన ప్రమాదం
బోటు షికారు ప్రయాణికుల్లో భయోత్పాతం కలిగింది. హుస్సేన్ సాగర్లో భాగమతి లాంచి మంగళవారం రాత్రి ప్రయాణికులతో బయలుదేరింది. కొద్ది సేపటికే భారీ వర్షం, ఈదురుగాలులు రావడంతో వాటి తాకిడికి లాంచీ ఒక్కసారిగా అదుపుతప్పింది. వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది స్పీడ్బోట్లతో దాని వద్దకు చేరుకొని తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఆ సమయంలో బోట్లో ఉన్న 40 మందిని సిబ్బంది సురక్షితంగా కాపాడారు.
నగరంలో నమోదైన వర్షపాతం (వివరాలు సెంటిమీటర్లలో.. )
రామచంద్రాపురం – 7.98
శేరిలింగంపల్లి – 7.75
కుత్బుల్లాపూర్ – 6.05
కూకట్పల్లి సర్కిల్ – 5.33
జీడిమెట్ల – 5.33
మూసాపేట్ సర్కిల్ – 4.63
మల్కాజిగిరి సర్కిల్ – 4.33
కాప్రా సర్కిల్ – 3.70
అల్వాల్ సర్కిల్ – 2.03
సికింద్రాబాద్ – 1.55
బేగంపేట సర్కిల్ – 1.55
జూబ్లీహిల్స్ సర్కిల్ – 0.93
ఖైరతాబాద్ సర్కిల్ – 0.93
ముషీరాబాద్ సర్కిల్ – 0.35
సైదాబాద్ – 0.20