సిటీబ్యూరో, సెప్టెంబరు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అవుతున్నది. అర గంట వర్షానికే చిగురుటాకులా వణికిపోతున్నది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను తిరగరాస్తా అంటూ ఏర్పాటు చేసిన హైడ్రా ప్రజల వరద కష్టాలను తీర్చకపోగా.. కొత్త కష్టాలను తెచ్చిపెట్టినట్లయింది. వరద నివారణ దేవుడెరుగు… గతంలో లెక్క వర్షం పడిన వెంటనే మొదలయ్యే సహాయక చర్యలు సైతం ఇప్పుడు మృగ్యమయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ సైతం నల్లపూసగా మారింది. మొన్నటిదాకా ఎవరి పని వారు చేయగా… ఇప్పుడు అందరూ హైడ్రా వైపు చూస్తుండటంతో అసలు పనులు అటకెక్కిపోయాయి.
నాలాల్లో పూడికతీత ఓ వివాదాస్పద అంశంగా తయారై అవి మృత్యుకుహరాలను తలపిస్తున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షాలంటే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయనే వార్తలతో పాటు నాలాల్లో నగరవాసులు కొట్టుకుపోయి మృత్యువాతపడుతున్నారనే విషాదకర సంఘటనలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నగరవాసులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నా.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పత్రికా ప్రకటనలు పరిమితం అవుతుండటం ఒకవంతైతే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దరిమిలా నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగరవాసుల తిప్పలను కనీసం చూడనైనా చూస్తలేరని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా దశాబ్దాలుగా హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షం కురిసినప్పుడు వరద కష్టాలు అనేవి కొంతమేర ఉంటాయి.
ఎప్పటికప్పుడు వాటిని తగ్గించేందుకు ప్రతి ఏటా వేసవిలో ప్రధాన విభాగాలైన జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ కార్యాచరణను అమలు చేస్తుంది. వర్షం పడినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం క్షేత్రస్థాయికి వెళ్తుంది. వీరికి ట్రాఫిక్ పోలీసులు సైతం సహకారంగా ఉండి ఒకవైపు ట్రాఫిక్ నియంత్రణతో పాటు వరద నీటిని త్వరితగతిన మళ్లించేందుకు చర్యలు తీసుకునేవారు. రహదారులపై ట్రాఫిక్ పోలీసులు వరద నీటిని పంపేందుకు మ్యాన్‌హోళ్లను ఎత్తడం, ఇతరత్రా పరిష్కార మార్గాలను చూపడం నగరవాసులకు తెలిసిందే.
కానీ అనూహ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుందని నగరవాసులు అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈసారి హైడ్రా పరిధిలోకి వెళ్లింది. దీంతో మందీమార్బలం ఎలాగూ తమ నుంచి పోయిందనే కారణంతో జీహెచ్ఎంసీ వర్షం పడే సమయంలో సహాయక చర్యలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. హెల్ప్‌లైన్ కొనసాగించడం మినహా గతంలో లెక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో జీహెచ్ఎంసీ పాత్ర చాలా మేరకు తగ్గిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పాటు ఈసారి నాలాల్లో పూడికతీత అంశం చాలా వివాదాస్పదంగా తయారైంది.
వాస్తవానికి వర్షాకాలానికి ముందే పూడికతీత పూర్తయి… భారీ వర్షాలొచ్చినా వరద సులువుగా ప్రవహించేరీతిలో అవి సిద్ధంగా ఉంటాయి. కానీ ఈసారి జీహెచ్ఎంసీ పూడికతీత పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే వివాదం తెరపైకొచ్చింది. ఆతర్వాత ఆ ప్రక్రియను హైడ్రా చూస్తుందని కొంతకాలం ప్రకటించారు. కాదు… కాదు… ఈసారికి మాత్రం జీహెచ్ఎంసీనే చూస్తుంది, హైడ్రా కేవలం పర్యవేక్షిస్తుందని ప్రకటించారు. కొన్నిచోట్ల హైడ్రా ఆధ్వర్యంలోనే నాలాల్లో పూడికతీత జరిగింది. ఆ మేరకు హైడ్రా అధికారిక వ్యాట్సప్ గ్రూపులో ఫొటోలు, వివరాలు కూడా పంపించారు. తాజాగా పూడికతీత అంతా జీహెచ్ఎంసీనే చూస్తుందంటున్నారు. ఇలా నాలాల్లో పూడికతీత ఎవరు చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? అనేది గందరగోళంగా తయారైంది.
ఈసారి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం… రహదారులు గోదారులను తలపించడం ఒకవంతైతే! నాలాల్లో వ్యక్తులు గల్లంతు కావడం అందరినీ కలవరానికి గురి చేస్తున్నది. మంగార్ బస్తీ నాలాలో ఇద్దరు గల్లంతు కాగా… ఐదు రోజుల తర్వాత నల్గొండ జిల్లా వలిగొండ సమీపంలో ఒక మృతదేహం లభించింది. మరో వ్యక్తి ఆచూకీ ఇప్పటిదాకా లభించలేదు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వినోబానగర్లోనూ మరో వ్యక్తి నాలాలో గల్లంతయి మృత్యువాతపడ్డాడు. బల్కంపేట ఆర్యూబీ కింద చేరిన వరద నీటిలో చిక్కుకొని మరో వ్యక్తి చనిపోయాడు. ఇలా రోజుల వ్యవధిలోనే వరుస సంఘటనలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా నాలాల్లో పూడికతీత తీయకపోవడంతో అనేక ఫీట్ల పూడిక పేరుకుపోయి మోస్తరు వరద వచ్చినా అది కాలనీలు, రోడ్లపైకి ప్రవహిస్తున్నది. వాస్తవానికి వర్షాకాలానికి ముందే పూడికతీత ప్రక్రియ సమర్థంగా జరిగి ఉంటే వరద సాఫీగా పోయి ఉండేది.
హైదరాబాద్ మహా నగరంలో వీధిలైట్లకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎల్ఈడీని ప్రవేశపెట్టడంతో రాత్రివేళల్లో నగర రూపురేఖలే మారిపోయాయి. కానీ గత కొంతకాలంగా నగరంలో వీధిలైట్ల తీరు అధ్వానంగా తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రముఖ కంపెనీ ఈఈఎస్ఎల్ను నిర్వహణ బాధ్యత నుంచి తప్పించింది. కొత్త ఏజెన్సీ ఖరారు నెలల తరబడిగా పెండింగ్‌లో ఉంది. జీహెచ్ఎంసీ సరైన నిర్వహణ చేయకపోవడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో అంధకారం అలముకుంటున్నది. ముఖ్యంగా భారీ వర్షాల సమయాల్లో వరదకు తోడు చీకటిగా ఉండటంతో అది వాహనదారుల ప్రాణాలకు సంకటంగా మారింది. బల్కంపేట ఆర్యూబీ కింద వ్యక్తి వరదలో చిక్కుకుని మరణించిన సమయంలోనూ అక్కడ వీధి దీపాలు వెలగడం లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు నేరుగా ఫిర్యాదు చేసినా ఎవరికీ పట్టింపులేకుండా పోయింది.
మునుపటికి ఈసారి వర్షాకాలంలో ప్రధానంగా క్షేత్రస్థాయి పర్యవేక్షణ అనేది నల్లపూసలా తయారైంది. గతంలో వర్షం పడే సమయానికిగానీ, పడిన వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం రోడ్లపైకి వచ్చేది. నీటి నిల్వ ప్రాంతాల్లో మోహరించి వరదను మళ్లించే చర్యలు చేపట్టేవి. వీరికి ట్రాఫిక్ పోలీసులు కూడా తోడయ్యేవారు. కానీ ఈసారి ఇలాంటి సమన్వయం ఎక్కడా కనిపించడం లేదు. చినుకుపడిందంటే కనీసం ట్రాఫిక్ పోలీసులు కూడా నియంత్రణ కూడా వదిలిపెడుతున్నారు.
గతంలో హైడ్రా సిబ్బంది జంక్షన్ల వద్ద ఉండి ట్రాఫిక్ నియంత్రణలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు వారు లేరు.. వీరు లేరు.. అన్నట్లుగా తయారైంది పరిస్థితి. బల్కంపేట ఆర్యూబీ దగ్గర వరద ఉధృతి ఆస్థాయిలో ఉన్నప్పటికీ అక్కడికి డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం చేరుకోకపోగా, కనీసం స్థానిక ట్రాఫిక్ పోలీసులైనా అక్కడికి వెళ్లి బారికేడ్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో ఓ వాహనదారుడు చీకట్లో ఏమీ తెలియక బ్రిడ్జి కింద ఉన్న వరదలో చిక్కుకొని మృత్యువాతపడ్డాడు. ఇలా గ్రేటర్లో విభాగాలన్నీ ఎవరికి వారే యమునా తీరే… అన్నట్లుగా వ్యవహరిస్తుండటం నగరవాసులకు మరిన్ని కష్టాలను తెచ్చి పెడుతున్నది.