HYD Rains | హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైంది. బండ్లగూడలో 8 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. చార్మినార్‌లో 7.6 బహదూర్‌పూరలో 7.8 సెంటీమీటర్లు, నాంపల్లిలో 6.9, అంబర్‌పేటలో 5, బండ్లగూడలో 4.6, కుత్బుల్లాపూర్‌లో 4.3, ఖైరతాబాద్‌లో 3.5, సికింద్రాబాద్‌లో 3.4, హిమాయత్‌నగర్‌లో 3, బాలానగర్‌లో 3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి, అమీర్‌పేట, పాటిగడ్డ, ముషిరాబాద్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, అసిఫ్నగర్తో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు సెంటీమీటర్ల వరకు వర్షాపాతం నమోదైంది.
పలుచోట్ల ఈదురుగాలులతో చిన్నగా మొదలైన వాన.. తర్వాత నగరవ్యాప్తంగా విస్తరించింది. వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులు వీశాయి. దాంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలుచోట్ల కొమ్మలు నేలవాలాయి. రహదారులు కొద్ది క్షణాల్లోనే చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తూర్పు, మధ్య తెలంగాణ అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు క్యూములోనింబస్ మేఘాలతో దాదాపు రెండుగంటల పాటు వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.