నబంజారాహిల్స్,సెప్టెంబర్ 23: నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ నేషనల్ పార్కులోని చెరువులు, కుంటలు నిండిపోయి వరదనీరు మొత్తం రోడ్లపైకి వస్తుండడం కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెం 2లో రెండు చోట్ల వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో చినుకుపడిందంటే చాలు ట్రాఫిక్ అధికారులతో పాటు హైడ్రా,జీహెచ్ఎంసీ అధికారులు గజగజ వణికిపోతున్నారు.
హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో వేలాది వాహనాలు కేబీఆర్ పార్కు ముందు నుంచి వెళ్తుంటాయి. దీంతో కేబీఆర్ మెయిన్ గేట్‌నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాకా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వరదనీటిని బయటకు పంపించడం ఎలాగో అర్థం కాక ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వరదనీరు మొత్తం దిగువభాగంలోని జవహర్‌కాలనీ, ఇందిరానగర్ బస్తీలను ముంచెత్తడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.